ఇంటిని చూసి ఇల్లాలిని చూడమని చెబుతారు పెద్దలు. ఇల్లు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉందంటే, ఆ ఇల్లాలు కూడా అంతే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నట్టు అర్థం. ఒకప్పుడు ఇంటిని చూసుకోవడం మాత్రమే ఇల్లాలికి పనిగా ఉండేది, కానీ ఇప్పుడు ఆమె వాణిజ్యవేత్తగా, రాజకీయ నాయకురాలిగా, అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా ఇలా రకరకాల పాత్రలను పోషిస్తోంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు రోజూ కచ్చితంగా తినాల్సిన ఆహారాలను, వాటిలో ఉండాల్సిన పోషకాలను చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడే ఈ ఆహారాలను తినడం వల్ల స్త్రీ ఆరోగ్యంగా జీవించగలుగుతుంది. స్త్రీ ఆరోగ్యంగా ఉండటంవల్ల ఆమె తన భర్తను, పిల్లలను కూడా బాధ్యతగా చూసుకోగలుగుతుంది. కాబట్టి స్త్రీ ఆరోగ్యంపైనా, తను తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
ఇనుము
అధిక పీరియడ్స్, నెలవారీ వచ్చే నెలసరి వల్ల మహిళలు చాలా రక్తాన్ని కోల్పోతారు. ఆ రక్తంలో ఎక్కువ శాతం ఇనుము బయటికి పోతుంది. దీనివల్ల శరీరం ఇనుము లోపం బారిన పడే అవకాశం ఉంది. ఇనుము శరీర కణజాలాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడానికి, హార్మోన్లను సృష్టించడానికి చాలా అవసరం. కాబట్టి ఇనుము కోసం నట్స్, సీఫుడ్, బీన్స్, ఆకుపచ్చని కూరగాయలు తినాలి.
ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి
శరీరంలో కొత్త కణాలను సృష్టించాలంటే విటమిన్ బి అవసరం. అలాగే ఫోలిక్ యాసిడ్ గర్భధారణ సమయంలో తల్లికి, బిడ్డకు అత్యవసరమైన పోషకం. ఇది శిశువులో న్యూరల్ ట్యూబును ఏర్పరుస్తుంది. శిశువులోని మెదడు, వెన్నుపాము అభివృద్ధి చేయడానికి ఫోలిక్ యాసిడ్ అత్యవసరం. కాబట్టి దీనికోసం మహిళలు నట్స్, బీన్స్, బచ్చలి కూర, పాలకూర, నారింజలు తినాలి.
విటమిన్ డి
భారతీయ స్త్రీలలో ఎక్కువ మంది మహిళలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. విటమిన్ Dకి సహజ వనరు సూర్యుడు. ఉదయం, సాయంత్రం వచ్చే నీరెండలో అరగంట పాటు ఉండడం వల్ల సూర్యరశ్మి నుంచి విటమిన్ Dని మన చర్మం శోషించుకుంటుంది. కానీ ఆ సమయాల్లో ఉద్యోగాల వల్ల బయట ఉండే అవకాశం మహిళలకు దక్కడం లేదు. కాబట్టి విటమిన్ డి శరీరానికి అందించే ప్రత్యమ్నాయి మార్గాలను వెతుక్కోవాలి. వీలైనంతవరకు సూర్యరశ్మి తాకేలా రోజులు కనీసం పావుగంట అయినా బయట ఉండడం ముఖ్యం. విటమిన్ డి ఎముకలకు, రోగ నిరోధక శక్తికి, శరీరంలో ఇన్ష్లమేషన్ తగ్గించడానికి, కణాల పెరుగుదలకు ముఖ్యమైనది. దీనికోసం సూర్యరశ్మిలో నిల్చోవడంతో పాటు, గుడ్డులోని పచ్చ సొనలు, చీజ్, పాలు తాగడం చాలా ముఖ్యం.
కాల్షియం
ముప్పై ఏళ్లు దాటాయంటే మహిళల ఎముకలు నీరసించడం మొదలుపెడతాయి. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, జున్ను, పెరుగు వంటివి రోజూ తినాలి.
మెగ్నీషియం
మెగ్నీషియం కండరాలు, నరాల ఆరోగ్యానికి చాలా అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, అధిక రక్తపోటు రాకుండా అడ్డుకోవడానికి, మెగ్నీషియం ముఖ్యమైనది. దీనికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడోలు వంటివి తినాలి.
Also read: హోలీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆ రంగుల నుంచి మీ కళ్ళను కాపాడుకోండిలా
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.