International Unborn Child History : పిల్లలు లేక కొందరు క్షోభకు గురవుతుంటే.. మరికొందరు మాత్రం వివిధ కారణాలతో గర్భాన్ని తొలగించుకుంటారు. కొందరు ఇష్టంలేక అబార్షన్ చేయించుకుంటే.. మరికొందరు లింగవివక్షతో బిడ్డను అబార్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గర్భం దాల్చినప్పటి నుంచి.. బిడ్డను క్షేమంగా భూమిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏటా మార్చి 25వ తేదీన అంతర్జాతీయ వ్యాప్తంగా అన్​బోర్న్ చైల్డ్ డే (International Day of the Unborn Child 2024)ని నిర్వహిస్తున్నారు. వివిధ విషపూరిత కారణాలతో.. లింగవివక్ష నెపంతో.. చాలామంది గర్భాన్ని రద్దు చేసుకుంటున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తించి.. అన్​బోర్న్ చైల్డ్​ డేని చేస్తున్నారు. అబార్షన్ వల్ల కలిగే నష్టాలను గురించి చెప్తూ.. పుట్టబోయే బిడ్డను అబార్షన్ చేయడం అనైతికమనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 


అంతర్జాతీయ అన్​ బోర్న్ చైల్డ్ డే చరిత్ర ఇదే..


అబార్షన్ వ్యతిరేకతపై పోరాటం చేస్తూ.. పుట్టబోయే పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో పోప్ జాన్ పాల్ II ఈ ఇంటర్నేషనల్​ అన్​బోర్న్ చైల్డ్​ డేను ప్రారంభించారు. అయితే దీనిని జీసస్ తన తల్లి కడుపులో ఉన్నప్పటి రోజును సూచిస్తుంది. అంటే మార్చి 25 నుంచి తొమ్మిది నెలల తర్వాత డిసెంబర్ 25న జీసస్ పుట్టినరోజును క్రిస్మస్​గా సెలబ్రేట్ చేసుకుంటారు. అబార్షన్ కారణంగా ఎంతో పిల్లలు తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారనే ఉద్దేశంతో ఈ రోజును నిర్వహిస్తున్నారు. 1993 నుంచి ఈ దినోత్సవాన్ని జరిపేందుకు కృషి చేశారు. అయితే 2002 నుంచి దీనిని కొన్ని దేశాలు రెగ్యూలర్​గా చేస్తున్నాయి. 


ప్రాముఖ్యత ఏమిటంటే.. 


ఇంటర్నేషనల్​ అన్​బోర్న్ చైల్డ్​ డే నిర్వహించడానికి ప్రధాన ప్రాముఖ్యత ఏమిటంటే.. అబార్షన్ చేయించుకోవడం చట్టవిరుద్ధమని సూచిస్తుంది. తల్లి కడుపులో ఉన్న పిల్లల జీవితాన్ని, ఉనికిని గౌరవించాలనే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తారు. లింగ వివక్ష, ఇతర స్వార్థపూరిత కారణాలతో గర్భాన్ని రద్దు చేయడం, చేయించడం మానవ హక్కులను ఉల్లంఘిచడంతో సమానమేనని దీని ఉద్దేశం. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 


తల్లికి కూడా నష్టమే


గర్భస్రావానికి వ్యతిరేకంగా.. పుట్టబోయే శిశువుల జ్ఞాపకార్థం దీనిని అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. కడుపులోనే మృత్యువాత పడుతున్న, అబార్షన్​లో ప్రాణాలు కోల్పోతున్న పిల్లలను ఈరోజు స్మరించుకుంటారు. పైగా అబార్షన్ చేయించుకోవడం వల్ల తల్లి శరీరంలో జరిగే నష్టాలను కూడా ఈరోజు గుర్తు చేస్తారు. అబార్షన్ చేయించుకోకుండా పిల్లలను రక్షించాలనే ఉద్దేశంతో దీనిని చేస్తున్నారు. 


ఇండియాలో ఇలా..


ఈ దినోత్సవాన్ని ఇండియాలో నిర్వహించరు కానీ.. అబార్షన్​కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. వెనుకబడిన ప్రాంతాల్లోనే కాకుండా.. వివిధ కారణాలతో చాలామంది అబార్షన్​ చేయించుకుంటారు. ఇది చట్టరీత్యా నేరం. అంతేకాకుండా పిల్లలను కడుపులోనే అంతం చేసే హక్కు ఎవరికీ లేదంటూ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. అబార్షన్ వల్ల తల్లికి కూడా నష్టం ఉంటుంది అంటున్నారు. ఈ ఎఫెక్ట్ తర్వాత పుట్టే పిల్లలపై కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అబార్షన్ చేసినప్పుడు కడుపులో శిశువుకి సంబంధించిన అవయవాలు ఉండిపోతే.. అది తల్లికి చాలా ప్రాణాంతకమని చెప్తున్నారు. అబార్షన్ చేయించుకోవడమే కాదు.. చేయడం కూడా భారత్​లో నేరంగానే పరిగణిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా.. అబార్షన్ చేయించుకోవడం నేరం. అందుకే దీనిపై ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. 


Also Read : హోలీ సమయంలో కళ్లను ఇలా కాపాడుకోండి.. లేదంటే కంటి చూపు కోల్పోవాల్సి వస్తుంది