Brs Leader Joginapally Response On Forgery Case: తనపై నమోదైన ఫోర్జరీ కేసుపై బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. షేక్ పేటలోని సర్వే నెంబర్ 129/54లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలాన్ని పూర్తి చట్టబద్ధంగానే కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. శ్యాంసుందర్ ఫుల్జాల్ ( తండ్రి పి.వి.హన్మంతరావు ) అనే వ్యక్తి నుంచి 2016లో (సేల్ డీడ్ నెంబర్ 5917/2016. 11 నవంబర్ 2016) రూ.3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి.. సేల్ డీడ్ ద్వారా, రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసినట్లు వివరించారు. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావులేదని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదని.. తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. 'నాకు ఇంటి స్థలాన్ని అమ్మిన శ్యాంసుందర్ ఆ భూమిని 1992లో సేల్ డీడ్ నెంబర్ 1888/1992 ద్వారా కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఎలాంటి న్యాయవివాదాలు లేవని ఆయన నాకు తెలియజేశారు. అంటే దాదాపు 32 ఏళ్లుగా ఆ భూమిపై ఎలాంటి న్యాయవివాదాలు లేవు. నేను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. శ్యాంసుందర్, అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే కొనసాగుతున్నాయి.' అని పేర్కొన్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే..
కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఫోర్జరీ కేసు నమోదు చేశారని జోగినపల్లి మండిపడ్డారు. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలుంటే ముందుగా లీగల్ నోటీసు ఇచ్చి వివరణ అడగాలని.. కానీ అలాంటిదేమీ లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారని చెప్పారు. వివాదాస్పద ఇంటి స్థలం 1,350 గజాలని పోలీసులు, మీడియా పేర్కొంటున్నారని.. కానీ తాను కొన్నది 904 గజాల ఇంటి స్థలం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ.. ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 'నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు. నేను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. న్యాయపరంగా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా పార్టీపై, నాపై రాజకీయ కక్షతో బురద జల్లాలని చూస్తే సహించేది లేదు. తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను.' అని హెచ్చరించారు.
ఇదీ జరిగింది
కాగా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14 లో ఓ భూ వివాదానికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుతో జోగినపల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ డాక్యుమెంట్స్ (Fake Documents), ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి తమకు సంబంధించిన భూమిని ఆక్రమించాలని యత్నిస్తున్నారని కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులను ఆశ్రయించారు. NECL కంపెనీ కు చెందిన భూమిలో అక్రమంగా రూములు నిర్మించారని ఫిర్యాదు చేశారు. ఈ నెల 21న ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగినపల్లితో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.