Mobile Phone Explosion: యూపీలోని మీరట్‌లో మొబైల్ పేలి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ పేలడం వల్ల ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబంలో ఈ ప్రమాదం కలకలం సృష్టించింది. హోళీ పండుగ కావడం వల్ల అందరూ ఇంట్లోనే ఉన్నారు. మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఒక్కసారిగా కరెంట్ వోల్టేజ్ పెరిగింది. ఫలితంగా మొబైల్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారు. వీళ్లలో నలుగురు పిల్లలే. ఈ మంటల్ని గుర్తించిన స్థానికులు వాటిని ఆర్పేందుకు చాలానే ప్రయత్నించారు. కానీ అప్పటికే చిన్నారులు అందులో చిక్కుకుని చనిపోయారు. చిన్నారుల తల్లిదండ్రులకి గాయాలయ్యాయి. వాళ్లను వెంటనే ఢిల్లీలోని AIIMSకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.