Ayurveda Remedies for Stomach Pain and Gas : కడుపులో సమస్యలు ఉంటే ఏ పనిపై ఏకాగ్రత ఉండదు. రోజు సరిగ్గా గడవదు. అలా మీరు గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఆయుర్వేదంలో మంచి చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. పదే పదే గ్యాస్ కడుపు నొప్పి, గ్యాస్ వస్తున్నప్పుడు వాటి నుంచి ఉపశమనం కోసం కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఆచార్య బాలకృష్ణ. ఇతర మెడిసన్స్ వాడినా సమస్య తిరిగి వచ్చే అవకాశం ఉందని.. కానీ ఆయుర్వేదంలోని ఈ మందులు సమస్యను పూర్తిగా కంట్రోల్ చేయడంలో హెల్పే చేస్తాయని అంటున్నారు. 

జీర్ణవ్యవస్థ స్ట్రాంగ్​ ఉంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారం, లైఫ్​స్టైల్ గట్ హెల్త్​ని ప్రభావితం చేస్తుంది. అయితే మీ గట్ హెల్త్ కరాబ్ అయినప్పుడు.. కడుపునొప్పి, గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? వాటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి

ఆయుర్వేదంలో ఉసిరిని అమృత ఫలం అని పిలుస్తారు. ఉసిరి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి సమస్యలను పూర్తిగా నయం చేసుకోవచ్చని సూచిస్తున్నారు ఆచార్య బాలకృష్ణ. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల కడుపు శుభ్రమవుతుందిన చెప్తున్నారు. ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, మంట నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుందట. ఇది జీర్ణశక్తిని బలపరిచి.. శరీరంలోని టాక్సిన్స్​ను బయటకి పంపిస్తుందని చెప్తున్నారు.

అలోవెరా

అలోవెరాను చర్మం, జుట్టు కోసం మాత్రమే కాకుండా జీర్ణవ్యవస్థకు కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఆచార్య బాలకృష్ణ ప్రకారం..  అలోవెరా జెల్ కడుపు మంట, గ్యాస్​ను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం పరగడుపున అర గ్లాసు అలోవెరా జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. పేగులను శుభ్రపరచి కడుపు నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం ఇస్తుంది.

త్రిఫల చూర్ణం

త్రిఫల (ఉసిరి, కరక్కాయ, తానికాయ) మిశ్రమం కడుపు సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని చెప్తారు. నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో 1 చెంచా త్రిఫల పొడి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. పేగులను బలపరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది. త్రిఫల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్​ను తొలగించి కడుపును తేలికగా, సౌకర్యవంతంగా చేస్తుంది.

లైఫ్​స్టైల్​లో చేయాల్సిన మార్పులు

వీటిని తీసుకోవడంతో పాటు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు ఆచార్య బాలకృష్ణ. కేవలం చికిత్సలపైనే కాకుండా సమతుల్య జీవనశైలిపై కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం, యోగాసనాలు వేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని తెలిపారు. నూనె, మసాలా, ఇతర జంక్ ఫుడ్​లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతిరోజూ ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గుతాయని సూచించారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.