పర్యాటక రంగం మీద ఎక్కువ ఆధారపడే దేశాల్లో ఇండోనేషియా ఒకటి. నిత్యం వేలాది మంది విదేశీ టూరిస్టులు ఆ దేశానికి వస్తుంటారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచ పర్యాటకులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే ప్రాంతం. ఇక్కడ ఉండే ప్రకృతి అందాలు, పురాతన కట్టడాలు, వారసత్వ నిర్మాణాలు ఎంతో ఆకట్టుకుంటాయి. కరోనా తర్వాత మళ్లీ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా ఇండోనేషియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ‘సెకండ్ హోమ్ వీసా’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ వీసాలు గతానికి భిన్నంగా ఉన్నాయి. వీటిని పొందిన విదేశీ పర్యాటకులు బాలిలో ఎక్కువ కాలం ఉండడానికి, పని చేయడానికి అవకాశం ఉంటుంది.
10 ఏండ్ల నివాస వీసాకు నిబంధన ఒక్కటే!
బాలిలో దీర్ఘకాల నివాసం కోసం సంపన్న పర్యాటకులను ఆకర్షించడానికి ఇండోనేషియా ‘సెకెండ్ హోమ్ వీసా’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విదేశీయులు దేశంలో ఎక్కువ కాలం ఉండటంతో పాటు పని చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే, ఈ వీసా ఇవ్వడానికి ఇండోనేషియా సర్కారు కొన్ని నిబంధనలను పెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, బ్యాంకు ఖాతాల్లో కనీసం 2 బిలియన్ రూపాయలు (₹10,717,544) కలిగి ఉన్న విదేశీయులకు 5, 10 సంవత్సరాలు నివాసం ఉండేలా సరికొత్త 'సెకండ్ హోమ్ వీసా'ను అందిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ నూతన వీసా విధానం క్రిస్మస్ రోజున లేదంటే కొత్త నిబంధన జారీ చేసిన 60 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది.
పర్యాటకుల ఆకర్షణకు కీలక నిర్ణయం
పర్యాటకులు ఎక్కువ రోజులు నివసించేందుకు ఉండేలా కోస్టా రికా, మెక్సికో ప్రభుత్వాలు ఇప్పటికే సెకండ్ హోమ్ వీసాలు జారీ చేస్తున్నాయి. తాజాగా వాటి లిస్టులో ఇండోనేషియా చేరింది. ఈ నూతన వీసా విధానం ద్వారా పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిపుణులు, పదవీ విరమణ చేసినవారు, ఇతర సంపన్న వ్యక్తులను ఆకర్షించడానికి దీర్ఘకాలిక వీసా ఉపయోగపడనుంది. "బాలితో పాటు దేశంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు వచ్చే విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఇమ్మిగ్రేషన్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ విడోడో ఏకత్జాజానా తెలిపారు.
పూర్తి స్థాయిలో విమాన సేవలు
ఇప్పటికే పర్యాటకులను బాగా ఆకర్షించేందుకు గరుడ ఇండోనేషియా వంటి విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలను పునఃప్రారంభించాయి. కరోనా తర్వాత మత సేవలను మళ్లీ పూర్తి స్థాయిలో అందిస్తున్నాయి. ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజుకుంది. అటు నవంబర్‌లో బాలిలో జరగబోయే G-20 సమ్మిట్ కారణంగా ఈ ద్వీపంపై అంతర్జాతీయ దృష్టి పడే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ లో సుమారు 10 వేల మంది విదేశీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
Read Also: స్నానమంటే బద్దకమా? ఈ మిషన్‌లో పడుకుంటే చాలు, అదే స్నానం చేయించేస్తుంది