ఔషదమంటే ప్రాణాలు నిలబెట్టేలా ఉండాలేగానీ.. ఉసురు తీయకూడదు. ముఖ్యంగా పిల్లలకు ఇచ్చే మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ, అలా జరుగుతుందా? గాంబీయాలో 66 మంది పిల్లల మరణమే ఇందుకు సమాధానం. ఔషదాల తయారీ విషయంలో మన సంస్థలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దయవల్ల ఈ విషయం బయటకు పొక్కింది. కానీ, ఎందరో అమాయకుల మరణాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇంతకీ గాంబీయాలో పిల్లల మరణానికి కారణమైన ఆ దగ్గు మందులో ఏముంది? ఎందుకలా జరిగింది? 


ఔషదాలను జాగ్రత్తగా తయారు చెయ్యకపోయినా, జాగ్రత్తగా వాడక పోయినా అవి ప్రాణాలు కాపాడాల్సింది పోయి ప్రాణాలు తీస్తాయని గాంబియాలో జరిగిన పలు సంఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ నుంచి తయారైనా నాలుగు రకాల దగ్గు, జలుబు మందులు పిల్లల మరణాలకు కారణం. ఈ బైడెన్ ఫార్మా కంపెనీ మన దేశానికి చెందినదే. పిల్లల మరణానికి కారణమైన ఆ నాలుగు మందులు ఇక్కడ తయారైనవే. 


గాంబియాలో 66 మంది పిల్లల మరణంతో ఇండియాలో తయారైన ఆ నాలుగు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ మందులు విషపూరితమని వ్యాఖ్యానించింది. ఆ నాలుగు మందులు పిల్లల దగ్గు, జలుబుకు వాడే సిరప్‌లు. వీటిలో ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్ మలిన్ బేబీ కాఫ్ సిరప్, మాకాఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ ఉన్నాయి.


మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో తయారైన ఈ ఉత్పత్తుల్లో  డైఇథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ కలుషితాలు ఉన్నట్టుగా పరీక్షల్లో తేలిందని గ్లోబల్ హెల్త్ ఏజెన్సీ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపుగా 23 నమూనాలలో  ఈ నాలుగు డైఇథలిన్ గ్లైకాల్ లేదా ఇథలిన్ గ్లైకాల్ ఉన్నట్టుగా తేలింది.


డైఇథలీన్ గ్లైకాల్ అంటే ఏమిటి, ఇది ఎందుకు ప్రమాదకరం?


❄ డై ఇథలిన్ గ్లైకాల్ విషపూరితమైంది. దీన్నీ వాడినపుడు కిడ్నీ, నాడీ మండలం మీద దీని ప్రభావం ఉంటుంది. ఈ రసాయనాన్ని మందులలో ఉపయోగించినపుడు మాస్ పాయిజనింగ్ జరిగినట్టు ఇది వరకు కూడా రుజువులు ఉన్నాయి.


❄ డై ఇథలిన్ రుచి తియ్యగా ఉంటుంది. ఎటువంటి వాసన, రంగు లేని హైగ్రోస్కోపిక్ ద్రవం. ఇది నీరు, ఆల్కహాల్, ఈథర్, అసిటోసిన్, ఇథిలిన్ గ్లైకాల్ లో బాగా కలిసిపోతుంది.


❄ డైఇథలిన్ గ్లైకాల్ తీసుకున్నపుడు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్రవిసర్జనలో సమస్యలు, తలనొప్పి, ఒక్కోసారి మతి బ్రమణం కలుగవచ్చు. కిడ్నీలకు తీరని నష్టం కూడా జరగవచ్చు.


❄ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ సమర్పించిన పేపర్ ప్రకారం 70 సంవత్సరాలలో చాలా సార్లు డై ఇథలిన్ గ్లైకాల్ వల్ల మాస్ పాయిజనింగ్ మరణాలు జరిగినట్టు చరిత్ర చెబుతోంది.


❄ ఇది మందుల తయారీకి ఉపయోగించడం సురక్షితమే. కానీ దీన్ని డైల్యూటెడ్ ఫాంలో  ఫార్మాస్యూటికల్ గ్రేడ్ గ్లిజరిన్ మాదిరిగా వాడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ ఉదంతం వల్ల భారతీయ ఫార్మా మరొక్కసారి ప్రపంచంలో చర్చనీయాంశం అయ్యంది. 


Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే


Also Read: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!