200 ఏళ్లు ఆంగ్లేయుల నిరంకుశ పాలన నుంచి భారతదేశం ఆగష్టు 15, 1947లో బయటపడింది. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలితంగా, భరతమాత దాస్య శృంఖలాలు తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చింది. ఈ శుభ సందర్భాన్ని దేశ ప్రజలంతా ప్రతి ఏటా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి 76 వసంతాలు పూర్తి కాగా, రేపు(ఆగష్టు 15, 2023) 77వ స్వాతంత్ర్య వేడుకలు దేశ వ్యాప్తంగా జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా తమ ఇండ్లు, కార్యాలయాల దగ్గర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుని స్వాతంత్ర్య వేడుకలను జరుపుకోవచ్చు. అయితే, జెండా ఎగురవేసే వాళ్లు కొన్ని నిబంధనలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002
జాతీయ పతాకానికి సంబంధించి పలు నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరిచారు. జాతీయ పతాకాన్ని ఉపయోగించడం, ప్రదర్శించడం, ఎగురవేయడం అనేది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002కు లోబడి జరగాలి. ఈ కోడ్ ప్రైవేట్, పబ్లిక్, ప్రభుత్వ సంస్థలు జాతీయ జెండాను ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలను వెల్లడిస్తుంది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా క్లాజ్ 2.1 ప్రకారం, జాతీయ జెండా గౌరవానికి ఇబ్బంది కలుగకుండా సాధారణ ప్రజానీకం, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు జాతీయ జెండాను ఎగురవేయవచ్చు. ప్రదర్శించవచ్చు. జాతీయ జెండాను అవమానించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడుతుంది.
ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకు సవరణలు
ప్రతి భారతీయ పౌరుడు సక్రమంగా జాతీయ పతాకాన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌కు రెండు ప్రధాన సవరణలు చేసింది. జూలై 20, 2022న, కేంద్రం ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాను సవరించింది. జాతీయ జెండాను బహిరంగ ప్రదేశంలో లేదంటే ప్రజలు తమ ఇళ్ల మీద పగలు, రాత్రి ఎప్పుడైనా ఎగురవేయడానికి అనుమతి కల్పిస్తోంది. అంతకుముందు, త్రివర్ణ పతాకాన్ని సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య మాత్రమే ఎగురవేసే అవకాశం ఉండేది. అటు చేతితో నేసిన తిరంగ పతకాలతో పాటు యంత్రంతో తయారు చేసిన జెండాల తయారీ కోసం పాలిస్టర్‌ను ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించింది. గతంలో ఖాదీతో మాత్రమే త్రివర్ణ పతాకాన్ని రూపొందించేవారు.
ఎండా ఎగురవేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 10 విషయాలు
1. చిరిగిన, మరకలు పడిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకూడదు.
2. జాతీయ జెండాను కాషాయ రంగు పైకి ఉండేలా చూసుకోవాలి.
3. జెండా ఎగురవేసిన తర్వాత దానివైపు చూస్తూనే సెల్యూట్ చేయాలి.
4. జాతీయ జెండా కంటే ఎత్తులో పక్కనే ఉన్న జెండాలను ఎగురవేయకూడదు.
5. జెండా గద్దెపై ఎలాంటి పూల దండలు, ఇతర చిహ్నాలు, వస్తువులు ఉంచకూడదు.
6. జెండా కర్రకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు మినహా మరే రంగులు ఉపయోగించకూడదు.
7. జాతీయ జెండాను నేలపై పెట్టకూడదు.
8. జాతీయ జెండాను ఏ ఇతర జెండాలో కలిపి ఏకకాలంలో ఎగురవేయకూడదు.
9. త్రివర్ణ పతాకాన్నినడుము కింది భాగంలో దుస్తులుగా ఉపయోగించకూడదు. రుమాలు, నేప్ కిన్లు, లోదుస్తులు, లేదంటే డ్రెస్ మెటీరియల్‌పై తిరంగ పతాకం మాదిరి ఎంబ్రాయిడరీ, ప్రింట్ చేయకూడదు.
10. జెండాపై ఎలాంటి అక్షరాలు ఉండకూడదు.
Read Also: 85 దేశాలు చుట్టేసిన వైజాగ్ యూట్యూబర్, అతడి నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial