ఫొటో చూడగానే ఆశ్చర్యపోయారు కదూ. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆమె చర్మం చేప తరహాలో మారింది. అయితే, ఇదేదో వింతైన వ్యాధి కాదు.. చికిత్స. ఔనండి.. కాలిన గాయాలకు చేప చర్మంతో చేసే చికిత్స. ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ఇది తెలుసుకోవల్సిందే.


టిలాపియా అనేది ఒక రకమైన చేప ఇప్పుడు బయోలాజికల్ బ్యాండెయిడ్ గా పనిచేస్తోంది. దీని చర్మన్ని బ్యాండెయిడ్ గా వాడినపుడు నొప్పి తగ్గడంతో పాటు రక్షణగా ఉంటుంది. గాయం త్వరగా మనిపోవడానికి కొల్లాజెన్ స్కాఫోల్డ్ గా ఇది పనిచేస్తోందట.


ఈ ఇన్నోవేటివ్ టెక్నిక్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. కాలిన గాయాలతో బాధపడుతున్న ఒకరు మెర్మెయిడ్ (సాగర కన్య)గా మారారని కామెంట్లు పెడుతున్నారు.


ఏమిటీ చేపతోలు కథ?


ఐఎఫ్జే బర్న్స్ యూనిట్ లో మొదటిసారిగా ఇనెస్ కాండిడో కాలిన గాయాలతో చేరారు. ఆమె టిలాపియా ఫిష్ స్కిన్ తో చికిత్స పొందిన మొదటి పేషెంట్.  ఆమె వంట చేస్తుండగా గ్యాస్ కుక్కర్ పేలడం వల్ల ఆమె చేతులు, మెడ, ముఖంలోని కొన్ని భాగాలు సెకండ్ డిగ్రీ బర్న్స్ అయ్యాయి. మొదట వచ్చినపుడు తనకు నర్సులు క్రీములు ఉపయోగించారని, అప్పటికి తాను భరించలేని నొప్పితో ఉన్నానని తెలిపారు. గాయాలు చాలా తీవ్రంగా, బలంగా ఉన్నాయని, క్రీము రాసేందుకు వారు తాకిన ప్రతిసారి విపరీమైన హింస అనుభవించానని పేర్కొన్నారు. కనీసం నీళ్లు తగిలినా నొప్పి భరించలేనంతగా ఉండేదన్నారు. టిలాఫియా ఫిష్ స్కిన్ ట్రీట్మెంట్ తనకు ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ లా అనిపించిందని అన్నారు. ‘‘ఇది నాకు ఎంతో సౌకర్యవంతంగా అనిపించింది. నాలా బాధపడుతున్న ఎవరికైనా నేను ఈ చికిత్స తీసుకునేందుకు వెనుకాడొద్దని చెబుతాను’’ అని స్పష్టం చేశారు. ఫిష్ డ్రెస్సింగ్ వల్ల త్వరగా కోలుకున్నానని ఆమె ఓ మీడియా సంస్థతో వెల్లడించారు.


టిలాపియా చర్మంలో కొల్లాజెన్ టైప్ వన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. అంతేకాదు దీనిలో తేమ కూడా ఎక్కువ. కాబట్టి ఇది తేమ కోల్పోయి డ్రైగా మారేందుకు ఎక్కువ సమయం పడుతుంది. డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన దాన్ని బట్టి ఇది అతిగా సాగు చేసే చేపరకం. చాలా మంది ఇష్టంగా తినే చేపరకం. ఈ చేపల 99 శాతం చర్మం చెత్తబుట్టలోకి చేరుతుంది. కొంత వరకు హ్యాండీ క్రాఫ్ట్స్ లో ఉపయోగిస్తారు. ఇలా వ్యర్థంగా పొయ్యే చేప చర్మాన్ని వారు ఉచితంగానే అందిస్తున్నారు. ఇప్పుడు పరిశోధనల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.  


కాలిన గాయాలు త్వరగా నయమయ్యేందుకు అవసరమైన ప్రొటిన్ ఈ చేపచర్మం ద్వారా నేరుగా చర్మానికి అందుతోందని ఈ చికిత్సలో పాలు పంచుకున్న వైద్య నిపుణులు అంటున్నారు. ‘‘చర్మం కాలిపోవడం వల్ల కలిగే తీవ్రమైన గాయాల చికిత్సకు, త్వరగా ఉపశమనం దొరికేందుకు టిలాపియా చేపచర్మం చాలా మెరుగ్గా పనిచేస్తుందని మేము తెలుసుకున్నాం’’ అని చికిత్సలో పాల్గొన్న వైద్యుల్లో ఒకరు తెలిపారు. సంప్రాదాయ పద్దతిలో క్రీములు ఉపయోగించి గాయానికి చికిత్స అందించడానికి పట్టినంత సమయమే పడుతుందన్నారు. అయితే ఈ కొత్త పద్ధతిలో చికిత్స అందించినపుడు నొప్పి, బాధ తక్కువగా ఉంటుందని, రోజూ డ్రెస్సింగ్ మార్చాల్సిన పని కూడా లేదని వెల్లడించారు.


గాయపడిన భాగం నుంచి లిక్విడ్స్, ప్లాస్మా, ప్రొటీన్ నష్టాన్ని చేప చర్మం చికిత్స తగ్గిస్తుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా పెద్ద మొత్తంలో తగ్గుతుంది. పైగా ఇది చాలా చవక కూడా. ఇలాంటి డ్రెస్సింగ్ ను అక్వాటిక్ డ్రెస్సింగ్ అంటారు. చికిత్సకు ముందు ఈ చర్మాన్ని క్యూరింగ్, డీకంటామనినేషన్, శీతలీకరణ వంటి రకరకాల రక్షణ ప్రక్రియలన్నీ దాటాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియల్లో పొలుసులు, కండర కణజాలాలు, టాక్సిన్స్ తొలగిపోతాయి. చేప వాసన కూడా ఉండదు. అక్వాటిక్ డ్రెసింగ్ టెన్సిల్ స్ట్రెంత్ మానవ చర్మానికి దగ్గరగా ఉంటుంది. గాయాన్ని చుట్టి ఉంచడానికి అనువుగా ఉంచుతుంది. దానిపై కూడా బ్యాండెడ్ వేస్తారు. దాన్ని 11 రోజుల తర్వాత తొలగిస్తారు.


Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?