Garlic in Winter for Maximum Benefits : చలికాలం రాగానే.. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటప్పుడు వంటగదిలో లభించే కొన్ని పదార్థాలు కచ్చితంగా డైట్లో తీసుకోవాలి. ఎందుకంటే అవి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి, వివిధ వ్యాధుల నుంచి రక్షించడానికి ఔషధంగా పనిచేస్తాయి. అలాంటి వాటిలో వెల్లుల్లి ఒకటి. పతంజలి యోగపీఠ్‌కు చెందిన ఆచార్య బాలకృష్ణ ఇటీవల వెల్లుల్లి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు. వెల్లుల్లి కేవలం ఆహార రుచిని పెంచే ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదని.. చలికాలంలో ఇది శరీరానికి ఒక వరంలా పనిచేస్తుందని వివరించారు.
గుండె, కీళ్ల ఆరోగ్యానికై..
ఆచార్య బాలకృష్ణ ప్రకారం.. వెల్లుల్లిని సరిగ్గా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచి.. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తి, డీటాక్స్ కోసం..
చలికాలంలో, రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీనివల్ల శరీరం జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులకు గురవుతుంది. ఆ సమయంలో వెల్లుల్లి తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరంలోని టాక్సిన్లను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు.
వెల్లుల్లిని ఎలా తీసుకోవాలంటే..
వెల్లుల్లి ప్రయోజనాలను పెంచడానికి.. ఆచార్య బాలకృష్ణ కింది పద్ధతులను సూచిస్తున్నారు. గార్లిక్ నేరుగా కాకుండా ఇలా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని చెప్తున్నారు.
- రాత్రిపూట నానబెట్టడం - 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను వలిచి రాత్రిపూట నీటిలో నానబెట్టండి. ఉదయం పరగడుపున ఈ నీటిని తాగండి. లేదా రెబ్బలను నమలండి. కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడానికి ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
- గోరువెచ్చని నీటితో : ఉదయాన్నే పరగడుపున 1–2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు.
నొప్పి నివారణ కోసం వెల్లుల్లి నూనె
కీళ్ల నొప్పులు, వాపు లేదా కండరాల బిగుసుకుపోవడం కోసం వంటి సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటే వెల్లుల్లి నూనెతో మసాజ్ చేయమని సిఫార్సు చేస్తున్నారు ఆచార్య బాలకృష్ణ. వెల్లుల్లి నూనె ఎలా చేసుకోవాలంటే..
- సుమారు 50 గ్రాముల వెల్లుల్లిని మెత్తగా నూరండి.
- దీనిని 100–200 గ్రాముల ఆవాలు, కొబ్బరి లేదా ఆలివ్ నూనెలో ఉడికించండి.
- వెల్లుల్లి నల్లగా మారినప్పుడు.. నూనెను వడకట్టి నిల్వ చేయండి.
ఈ నూనె నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. ఇది నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.