DGCA Action Against Indigo CEO | ఇండిగో విమానాలను రద్దు చేయడం వల్ల ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుంచి చెన్నై విమానాశ్రయాల వరకు గందరగోళం నెలకొంది. దీనికి ప్రభుత్వం ఇండిగో ఎయిర్‌లైన్‌ను బాధ్యులను చేసింది. DGCA ఇండిగో సీఈఓకి శనివారం నాడు షోకాజ్ నోటీసును కూడా జారీ చేసింది. మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలని నోటీసులలో పేర్కొంది.
గత మూడు రోజుల నుంచి వేలాది మంది ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీపై ఎందుకు పెనాల్టీ విధించకూడదో తెలపాలని DGCA ఇండిగోకు జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే ఎయిర్‌లైన్ కంపెనీ భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది.
CEO ఎయిర్‌లైన్ కార్యకలాపాల బాధ్యత: DGCA
ఎయిర్‌లైన్ సజావుగా నడపటం ఇండిగో సీఈవో బాధ్యత అని DGCA స్పష్టం చేసింది. అయితే ప్రయాణీకుల సౌకర్యాలు, కార్యకలాపాలను నిర్వహించడంలో CEO ఫెయిలయ్యాడు. 24 గంటల్లో DGCA మీపై ఎందుకు చర్య తీసుకోకూడదో చెప్పాలని CEOకు నోటీసులు జారీ చేసింది. సమాధానం ఇవ్వకపోతే, DGCA దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.
ఇండిగో షెడ్యూల్ చేసిన విమానాలలో సమస్యలు
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో విమానాలలో పెద్ద లోపాలు ఉన్నాయని తెలిపింది. ఇటీవల ఇండిగో షెడ్యూల్ చేసిన పలు విమానాలలో పెద్ద సమస్యలు తలెత్తాయి. దీని వలన ప్రయాణికులకు చాలా ఇబ్బంది, కష్టం, బాధ కలిగింది. విమానాలను రద్దు చేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఎయిర్‌లైన్ సవరించిన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్) నిబంధనలను అమలు చేయడానికి సరైన సన్నాహాలు చేయకపోవడం. పైలట్‌లు/ సిబ్బంది కోసం సరైన ఏర్పాట్లు, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయలేదు.
ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించలేదు: DGCA
ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ విఫలమవ్వడం ప్లానింగ్, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాన్ని చూపుతుందని నోటీసులో డీజీసీఏ పేర్కొంది. ఇండిగో ఎయిర్‌లైన్ అనేక నిబంధనలను పాటించలేదు. ఇండిగో తమ ప్రయాణికులకు ఆలస్యం, రద్దు గురించి సకాలంలో సమాచారం అందించలేదని, అవసరమైన సహాయం అందించలేదని DGCA ఆరోపించింది. ఇది కచ్చితంగా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని నోటీసుల్లో పేర్కొంది.