చూసేందుకు ముళ్ళు తోలు కప్పుకుని ఉండే పండు పనస పండు. చూడగానే పెద్దగా ఆకట్టుకోదు. తొక్క మొత్తం తీసి అందులోని తొనలు తీస్తే మాత్రం లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. దీన్ని జాక్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దీని స్మెల్ కూడా అదిరిపోద్ది. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఏ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి సమృద్ధిగా అందిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినగలిగే పండ్ల జాబితాలో ఇదీ కూడా ఒకటి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. ఈ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ పండు మాత్రమే కాదు ఇందులోని పిక్కలు(విత్తనాలు) కూడా ఆరోగ్యకరమనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.


ఈ విత్తనాల్లో థయామిన్, రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఆహారాన్ని శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. కళ్ళు, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పిక్కల్లో జింక్, ఇనుము, కాల్షియం, రాగి, పొటాషియం, మెగ్నీషియం ఉన్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల అభివృద్ధిని తగ్గించడంలో సహాయపడతాయి. అందుకే వీటిని పడేయకుండ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. జాక్ ఫ్రూట్ విత్తనాల మరికొన్ని ప్రయోజనాలు ఏంటంటే..


జీర్ణక్రియ: పనస విత్తనాలలోని ఫైబర్ పేగు కదలికలు సరి చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.


గుండె ఆరోగ్యం: ఈ గింజల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్త నాళాలని సడలించడం ద్వారా రక్తపోటుని తగ్గిస్తుంది. గుండె, రక్త ప్రసరణ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


ఎముకలు బలపేతం: బలమైన ఎముకల కోసం కాల్షియంతో పాటు అనేక ఇతర పోషకాలు అవసరం. మెగ్నీషియం అధికంగా ఉండే జాక్ ఫ్రూట్ విత్తనాలు కాల్షియం శోషణకి దోహదపడతాయి. ఎముకల్ని బలోపేతం చేస్తాయి.


రక్తహీనత నివారణ: ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత కనిపిస్తుంది. జాక్ ఫ్రూట్ గింజల నుంచి వచ్చే ఐరన్ ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇనుము తగినంత తీసుకోవడం వల్ల శరీరం అంతటా ఆక్సిజన్ పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ఇనుము లోపాన్ని భర్తీ చేస్తే రక్తహీనతని నివారించడంలో సహాయపడుతుంది.


జీవక్రియ: అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా జాక్ ఫ్రూట్ గింజలు బలమైన శక్తి వనరుగా పని చేస్తాయి. వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. ఆహారాన్ని శక్తిగా మార్చి జీవక్రియని ప్రోత్సహించేందుకు దోహదపడతాయి.


మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది: జాక్ ఫ్రూట్ విత్తనాల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. మానసిక ఒత్తిడి స్థాయిలు, చర్మ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టుని ఇస్తాయి.


పచ్చిగా తినవద్దు
ఈ గింజలు మంచివే. అయితే వండుకుని తింటేనే. పచ్చివి తినడం వల్ల సమస్యలు రావచ్చు. మందులను శోషించకునే శక్తి శరీరానికి తగ్గిపోవచ్చు. లేదా ఏదైనా దెబ్బ తాకినప్పుడు రక్త స్రావం అయ్యే ప్రమాదం పెరగవచ్చు. అందుకే వీటిని ఉడకబెట్టుకుని, నిప్పుల్లో కాల్చుకుని లేదా కూరలా వండుకుని తినాలి. అలా తింటే బోలెడన్నీ పోషకాలు అందుతాయి. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: జాగ్రత్త! ఊబకాయం వల్ల 18 రకాల క్యాన్సర్లు వస్తాయట


Join Us on Telegram: https://t.me/abpdesamofficial