Walking Tips: మనం చేయగలిగే వ్యాయామాల్లో అత్యంత సులువైనది, అలాగే చాలా ప్రభావవంతంగా ఉండే ఎక్సర్సైజ్ ఏదైనా ఉందంటే అది వాకింగ్ అనే చెప్పవచ్చు.  ఇందుకోసం మీరు పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.  మీకు నచ్చినంత సేపు ఓపిక ఉన్నంత దూరం నడిస్తే.. మీ ఆయుష్షు పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇటీవల కొంతమంది నిపుణులు జరిపిన పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా వాకింగ్ కి సంబంధించిన అంతవరకు ఎన్ని అడుగులు నడవాలి, దాని ప్రభావం శరీరంపై ఎంత ఉంటుంది అనేదానిపైన ఈ పరిశోధన  నిర్వహించారు. సాధారణంగా 6000 అడుగులు ప్రతిరోజు నడిస్తే ఆయుష్షు పెరుగుతుందని, చనిపోయే ప్రమాదం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అమెరికాకు చెందినటువంటి యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నిపుణుల బృందం సుమారు 50 వేల మంది పైన జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.  ఈ పరిశోధనలో ముఖ్యంగా వయసు రీత్యా ఎలా ప్రభావం చూపుతుంది అన్న దానిపైన సైతం పలు విషయాలు బయట పెట్టారు. 


40 నుంచి 60 ఏళ్లు ఉన్నవారు ఎన్ని అడుగులు నడవాలి: 


ముఖ్యంగా నడివయసులో ఉన్నవారు 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు రోజుకు 6 వేల అడుగుల నుంచి 8 వేల అడుగుల వరకు వాకింగ్ చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇక యువకుల విషయానికి వచ్చినట్లయితే 8 వేల అడుగుల నుంచి పదివేల అడుగుల వరకు నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇలా చేసినట్లయితే మీరు ఆయుర్దాయం పెరుగుతుందని  పరిశోధనలో తేలింది.  ముఖ్యంగా మారుతున్న ఆధునిక జీవనశైలి కారణంగా బద్ధకం అనేది పెరుగుతోందని దీని నుంచి బయట పడాలంటే నడక చక్కటి పరిష్కారం అని నిపుణులు సూచిస్తున్నారు. 


శారీరక వ్యాయామం లేకుంటే ఈ వ్యాధులు తప్పవు: 


శారీరక వ్యాయామం లేకపోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, అధిక రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నడకతో పాటు వారానికి కనీసం రెండు రోజులపాటు బరువులు ఎత్తే వ్యాయామం చేయాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రతిరోజు కనీసం అరగంటసేపు వాకింగ్ చేయాలని, నెమ్మదిగా ప్రారంభించి వేగం పెంచుకుంటూ వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 6000 నుంచి 9000 అడుగులు నడిచినట్లైతే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా 50%  రిస్క్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. నడివయసులో ఉన్న వ్యక్తి కనీసం రోజుకు 7 అడుగులు నడిచినట్లయితే, అతడు మరణించే రిస్క్ 50 శాతం తగ్గిపోతుంది అని సైతం డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక పదివేల అడుగులు నడిచే వ్యక్తి నిత్య యవ్వనంతోను ఆరోగ్యంగా ఉంటాడని డాక్టర్లు సూచిస్తున్నారు. 


వాకింగ్ వల్ల బోలేడు ప్రయోజనాలు: 


రోజూ వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరం నుండి చెమటను కలిగిస్తుంది. శరీరం నుండి బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. దీని వల్ల అనేక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. రోజూ వాకింగ్ చేయడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది, అలా చేయడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. నడక రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగం, వ్యాయామంతో పాటు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 


Also Read : ఈ ఫుడ్స్ క్యాన్సర్​ను నివారించడంలో హెల్ప్ చేస్తాయట.. నిపుణుల సలహా ఇదే




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.