పూర్వం నుంచి పెద్దలు ఒక మాట చెప్పేవారు ... అల్పాహారం చక్రవర్తిలా తినాలి, మధ్యాహ్న భోజనం మంత్రిలా ఆలోచించి ఆచితూచి తినాలి, రాత్రి భోజనం మాత్రం పేదవాడిలా తినాలి. అందుకే అల్పాహారంలో తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చక్రవర్తిలా తినమన్నారు కదా అని ఏవి పడితే అవి, ఎంత పడితే అంత తినేయమని కాదు. మిగతా రెండు పూటలతో పోలిస్తే కాస్త ఎక్కువ తినమని అంతే. అలా అని అధిక కేలరీలుండే ఆహారాన్ని మాత్రం లాగించకూడదు. ఇలా రోజుల తరబడి బ్రేక్ ఫాస్ట్ సమయంలో అధిక కేలరీలుండే ఆహారం తినడం వల్ల బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. కొన్ని రోజులకు పొట్ట పెరిగి బానలా మారుతుంది. నడుము చుట్టుకొలతలు మారిపోతాయి. కాబట్టి అల్పాహారంలో ఏ ఆహారం తినకూడదో చూద్దాం. 


తియ్యటి జ్యూస్‌లు
పండ్ల జ్యూస్‌లు తాగండి కానీ అందులో పంచదార కలుపుకోవద్దు.  అలాగే ప్రిజర్వేటివ్ జ్యూస్ లు అంటే బయట మార్కెట్లలో దొరికే నిల్వ జ్యూస్ ప్యాక్ లు తాగవద్దు. ఇవి శరీరానికి అధిక కేలరీలను జోడిస్తాయి. 


రీఫైన్డ్ పిండి
అతిగా శుద్ధి చేసిన మైదా వంటి పిండితో చేసిన ఆహారాలను బ్రేక్ ఫాస్ట్ లో తినకండి. ఇందులో పోషకాలు ఉండవు సరికదా, చెడు కొవ్వులను పెంచేస్తాయి. శరీరానికి అధిక కేలరీలు చేరేలా చేస్తాయి. 


ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు
కృత్రిమ తీపి పదార్థాలు చాలా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ ప్రత్యేకంగా డయాబెటిస్ ఉన్నవారి కోసం. ఇవి చక్కెర కన్న తక్కువ కేలరీలు కలిగి ఉన్నప్పటికీ అంతర్లీనంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాలేయం, మూత్రపిండాల సమస్యలు వంటివి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. 


వేయించిన ఆహారం
బ్రేక్‌ఫాస్ట్ లో వేపుళ్లు, డీప్ ఫ్రై ఆహారాలు తినకూడదు. ఎందుకంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్లు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది నడుము దగ్గర కొవ్వును పెంచేస్తుంది. 


బేకరీ ఉత్పత్తులు
బేకరీ ఆహారాల్లో అన్నీ శుద్ధి చేసిన ఆహారాలనే ఉపయోగిస్తారు. మైదా, చక్కెరను అధికంగా ఉపయోగిస్తారు. మఫిన్లు, డోనట్స్, స్వీట్ బ్రెడ్ వంటివన్నీ వీటితోనే చేస్తారు. ఇవి చాలా చెత్త ఆహారాల జాబితాలో ఉంటాయి. వీటిని ఉదయానే తినడం వల్ల చెడు కొవ్వు శరీరంతో చేరిపోతుంది. 


పీనట్ బటర్
ఇది చాలా మంది  బ్రేక్‌ఫాస్ట్‌లో తినే పదార్థం. బ్రెడ్ కు ఇంత పీనట్ బటర్ రాసుకుని తినేసి ఆఫీసులకు వెళ్లిపోతారు. ఇలా రోజూ తినే వాళ్లు ఎంతో మంది. పీనట్ బటర్లో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్ రసాయనాలు ఉంటాయి. ఉప్పు, చక్కెర శాతం కూడా ఎక్కువ. దీన్ని తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు. 


Also read: డయాబెటిస్ ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన నాలుగు కూరగాయలు ఇవే


Also read: మేకప్ తీయకుండా నిద్రపోతున్నారా? మీ చర్మం ఎంతగా దెబ్బతింటుందో తెలుసా?





















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.