పొట్టు ఉన్న పెసరపప్పును వాడే వారి సంఖ్య చాలా తక్కువ. మార్కెట్లో దొరికే పెసరపప్పు పైన పొట్టు తీసి, పాలిష్ చేసి అమ్ముతారు. దాన్ని తినే కన్నా పొట్టు తీయని పెసరపప్పును కొని వాడుకోవడమే మంచిది. పొట్టు ఉన్న పెసరపప్పును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రోటీన్‌కు పెసరపప్పు మంచి మూలం. మొక్కల ఆధారిత వనరులలో పెసరపప్పులోనే ప్రోటీన్ అధికంగా దొరుకుతుంది. 


సూపర్ మార్కెట్లలో పొట్టు తీసిన పెసరపప్పుతో పాటు, పొట్టు తీయని పెసరపప్పు కూడా దొరుకుతుంది. ఎక్కువమంది పొట్టు తీసిన పెసరపప్పునే వినియోగిస్తారు. పొట్టు తీయని పెసరపప్పును తీసుకుని రాత్రంతా నానబెడితే ఉదయానికి మొలకలు రావడం జరుగుతుంది. ఆ మొలకలు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం. అలాగే ఆ పెసరపప్పును రుబ్బి చిన్న అల్లం ముక్క వేసి జీలకర్ర కలిపి పేస్టులా చేసుకుని... దాంతో దోశెలు వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇలా పెసరపప్పుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. పెసరపప్పును తినడం వల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. మన శరీరానికి రోజువారి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. అలాగే ఐరన్ వంటివి కూడా అందుతాయి. దీనిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. దీన్ని తింటే మలబద్ధకం లక్షణాలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. 


పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలు తరచూ తింటూ ఉంటే గుండె జబ్బుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. తద్వారా గుండెపోటు రాకుండా ఉంటుంది. పొట్టు ఉన్న పెసరపప్పులో మెగ్నీషియం, పొటాషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, విటమిన్ బి, విటమిన్ బి2, విటమిన్ బి3 ముఖ్యమైన పోషకాలు ఎన్నో ఉంటాయి. పెసర పప్పులోనే కాదు ఆ పప్పు పైన ఉండే పొట్టులో కూడా ఇవన్నీ లభిస్తాయి. పొట్టు ఉన్న పెసరపప్పు క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి తింటే బరువు పెరుగుతారన్న బెంగ లేదు. అలాగే పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల ఇతర ఆహారాలను తక్కువగా తింటారు. దీని వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.


మహిళల ఆరోగ్యానికి కూడా పొట్టు ఉన్న పెసరపప్పు చాలా అవసరం. దీనిలో థయామిన్, ఫోలేట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మహిళ శరీరానికి అవసరమైనవే. గర్భిణీలు పొట్టు ఉన్న పెసరపప్పును తింటే బిడ్డలు న్యూరల్ ట్యూబ్ లోపాలు రాకుండా ఉంటాయి. అలాగే ఆటిజం వంటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. బిడ్డకు గుండె జబ్బులు వచ్చే ఛాన్సులు కూడా తగ్గుతాయి. గర్భిణీలకు రిబోఫ్లావెన్ చాలా ముఖ్యం. దీని కోసం పెసర పప్పును తింటే మంచిది. ప్రాణాంతక పరిస్థితులు రాకుండా పెసరపప్పు అడ్డుకుంటుంది. అలాగే బిడ్డలకు పుట్టుకతో వచ్చే లోపాలను కూడా రాకుండా నిరోధిస్తుంది. ఎముకలను, కండరాలను బలంగా మారుస్తుంది. మహిళలు ఈ పొట్టు ఉన్న పెసరపప్పును తరుచూ తినడం వల్ల బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది.


అధిక రక్తపోటు ఉన్నవారు పొట్టు తీయని పెసరపప్పుతో చేసిన వంటకాలు తరచూ తినడం చాలా అవసరం. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అన్ని అవయవాలకు రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. వీటిని తింటే రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలకు బారిన పడకుండా కాపాడుకోవచ్చు. గుండెను కూడా రక్షించుకోవచ్చు. 


Also read: ముందు రోజే చపాతీ, పూరి పిండిని కలిపి నిల్వ చేయడం మంచిదేనా?






































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.