మొన్నటి వరకు టమోటో ధరలు భగ్గుమన్నాయి. ఇప్పుడు వాటి ధరలు తగ్గాయి. కాబట్టి టమోటో వంటకాలే కాదు, టమోటాతో అందాన్ని పెంచే చిట్కాలు కూడా పాటించవచ్చు. టమోటో రసాన్ని లేదా గుజ్జును చర్మానికి అప్లై చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఎండలో తిరగడం వల్ల చర్మానికి ట్యాన్ పట్టేస్తుంది. దీనివల్ల నల్లగా మారుతుంది . టమోటోల్లోని గుణాలు ఆ నలుపుతనాన్ని పోగొడతాయి. ట్యాన్ ను పూర్తిగా తొలగిస్తాయి. అలాగే చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. కాబట్టి టమోటోలతో అందాన్ని ఎలా పరిరక్షించుకోవచ్చో తెలుసుకోండి.


రోజూ ఒక టమాటో ముక్కను తీసుకుని ముఖం పై రుద్దుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. సహజమైన మెరుపు వస్తుంది. టమోటోలో వ్యర్ధాలను తొలగించే గుణం ఉంటుంది.  టమోటా పై కాస్త చక్కెర జల్లుకొని దాంతో ముఖాన్ని రుద్దినా మృతకణాలన్నీ తొలగిపోతాయి. అలాగే మురికి కూడా పోతుంది. మొటిమలు ఉన్నవాళ్లు టమోటోను ఉపయోగిస్తే మంచిది. టమోటోలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి. మొటిమలు ఉన్నచోట టమోటా ముక్కలు తీసుకుని బాగా రుద్దితే అవి త్వరగా తగ్గిపోయే అవకాశం ఉంది.


మీ చర్మం జిడ్డుగా ఉన్నట్లయితే టమోటోతో ప్రతిరోజు రుద్దుతూ ఉండండి. ఇది చర్మంపై సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వల్ల చర్మం జిడ్డుగా ఉండదు. ఫ్రెష్ గా కనిపిస్తుంది. టమోటాను ముఖంపై అప్లై చేశాక పావుగంట పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఒక టీ స్పూన్ టమోటో రసంలో, కొన్ని చుక్కల నిమ్మ రసాన్ని ఉపయోగించి ముఖంపై బాగా రుద్దాలి. పావుగంట పాటు వదిలేయాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా ఉండి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.


చర్మం దురదగా అనిపిస్తున్నప్పుడు టమోటోను తీసుకొని ముఖంపై రుద్దుకోండి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. చర్మంపై చికాకు, మంటను తగ్గిస్తాయి. అలాగే దీనిలో విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి. టమోటోలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఎక్కువ. కాబట్టి చర్మం పై గీతలు, ముడతలు రాకుండా ఇది కాపాడుతుంది. వీటిని తరచూ వంటల్లో భాగం చేసుకోవడమే కాకుండా పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసుకుంటే మంచిది. కొన్ని రోజుల్లోనే మీకు అద్భుతమైన తేడా తెలుస్తుంది.


Also read: బరువు పెరుగుతున్నారని అన్నం తినడం మానేయకండి, అది చాలా ప్రమాదకరం



Also read: అయోడిన్ సరిపడా తింటున్నారా? అది లోపిస్తే ఈ జబ్బు రావడం ఖాయం































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.