ప్రపంచంలో అధిక శాతం మందిలో క్యాన్సర్ వెలుగు చూస్తోంది. దీనికి మారిన జీవనశైలి, ఆరోగ్యపు అలవాట్లు, వారసత్వం... ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. ఏ రకం క్యాన్సర్ అయినా ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభతరం అవుతుంది. తిరిగి ఆరోగ్యంగా జీవించే అవకాశాలు కూడా ఎక్కువ. అదే మూడు, నాలుగు దశల్లో గుర్తిస్తే మాత్రం చికిత్స చాలా కష్టంగానే కాదు, ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు.ప్రాథమిక దశలో ఉన్నప్పుడే క్యాన్సర్ తాలూకు కొన్ని లక్షణాలు బయటపడతాయి. వాటిని తేలికగా తీసుకోకుండా చెకప్ చేయించుకుని రోగనిర్ధారణ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ (ovarian cancer), గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ వంటివి వస్తుంటాయి.ఏ క్యాన్సర్ అయిన ప్రాథమిక దశలో కొన్ని తేలికపాటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో కింద చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 


పొట్టలో మార్పులు
పొట్ట ఉబ్బరంగా అనిపించడం, మలబద్ధకం, విరేచనాలు, పొట్ట త్వరగా ఖాళీ అవుతున్న భావన... ఇవన్నీ అనేక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. అలాగే పెద్ద పేగు క్యాన్సర్ లక్షణం కూడా అయ్యే అవకాశం ఉంది. కొంతమంది మహిళలు పొట్టలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు అది రుతుచక్రాల వల్ల కలుగుతుందని అనుకుంటారు.ఈ లక్షణాలు ఆ సమయంలోనే కాదు ఆ తరువాత కూడా కొనసాగితే సీరియస్‌గా తీసుకోవాలి.


పొట్ట ఉబ్బరం  
అండాశకయ క్యాన్సర్ లక్షణాలు చాలా అస్పష్టంగా ఉంటాయి. కడుపుబ్బరంగా అనిపిస్తుంది. కానీ చాలా మంది తిన్నది అరగక అలా అయ్యిందనుకుంటారు. తరచూ ఉబ్బరం వేధిస్తుంటే అది క్యాన్యర్ హెచ్చరిక కావచ్చు. రెండు వారాల పాటూ ప్యూబిక్ బోన్ (జననాంగం పై నుంచి ఉండే ఎముక) నుంచి పక్కటెముక వరకు నొప్పిని గమినిస్తే మాత్రం అది అండాశయ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే హఠాత్తుగా బరువు పెరగడం కూడా ఒక లక్షణమే. 


రక్తస్రావం
రుతుక్రమం సమయం దాటిపోయినా కూడా ఇంకా రక్త స్రావం అవుతున్నా, లేదా రుతుక్రమం సమయంలో అధికంగా రక్తస్రావం అవుతున్నా, రుతుచక్రం అసాధారణంగా మారినా కచ్చితంగా అనుమానించాలి. ఇవి క్యాన్సర్‌కే కాదు ఇతర సమస్యల లక్షణాలు కూడా కావచ్చు. 


మెడలో వాపు
మహిళల్లో అధికంగా వస్తున్న క్యాన్సర్లలో థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇది పురుషుల కంటే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువగా వస్తోంది. థైరాయిడ్ క్యాన్సర్ మెడ ముందు భాగంలో ఉన్న సీతాకోక చిలుక ఆకారపు గ్రంధిలో గడ్డగా ఏర్పడుతుంది. ఈ క్యాన్సర్ చాలా మేరకు పెద్ద ప్రమాదాన్ని కలుగజేయదు. కానీ తీవ్రంగా మారితే మాత్రం హానికరమే. 


బరువు తగ్గడం
మీరెలాంటి ప్రయత్నాలు చేయకుండా హఠాత్తుగా బరువు తగ్గడం కూడా మంచి సంకేతం కాదు. కానీ ఇలా జరగడం కాలేయం, పెద్ద పేగు, లింఫోమా, లుకేమియా, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ల లక్షణం కావచ్చు. బరువు మరీ తగ్గితే ఓసారి వైద్యుడిని సంప్రదించడం మేలు. 


Also read: పిల్లల్ని ఇంటి దగ్గర ఒంటరిగా వదిలి వెళుతున్నారా? వారికి కచ్చితంగా నేర్పాల్సిన విషయాలివే


Also read: సిగరెట్లు మానకపోతే చూపు పోయే ప్రమాదం, కళ్లను కాపాడుకోండిలా