డయాబెటిస్ ఉందంటే చాలు ఆహారంలో కత్తెరలు పడతాయి. ఇవి తినకూడదు, అవి తినకూడదు అని పొట్ట మాడ్చుకుంటారు చాలామంది. ఎందుకంటే మనం తినే ఆహారమే శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంద. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల పాంక్రియాస్ ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఆహారాన్ని వీరు తినాలి. ఇలాంటి ఆహారం మధుమేహంతో బాధపడుతున్న వారిలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ ప్రక్రియలో ప్రొటీన్లు విచ్ఛిన్నం కావడం అనేది ముఖ్యమైన భాగం. ఆ ప్రొటీన్లే అమైనో ఆమ్లాలుగా విడిపోతాయి. ఇవి పాంక్రియాటివక్ కణాలను మరింత ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి ప్రేరేపిస్తాయి. మధుమేహంతో బాధపడే వారు తమ రోజువారీ ఆహారంలో కింద చెప్పిన అయిదు ఆహారాలను భాగం చేసుకోవాలి. దీనివల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
బెండకాయ
బెండకాయ కూర, వేపుడు, పులుసు... ఎలా తింటారో మీ ఇష్టం. దీన్ని తినడం వల్ల మాత్రం చాలా మేలు జరుగుతుంది. ఇది డైటరీ ఫైబర్‌తో నిండి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను ఇది నియంత్రిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. బెండకాయలో ఉండే గుండ్రని విత్తనాలలో ఆల్ఫా గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్లు ఉంటాయి. ఇవి పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారకుండా నిరోధిస్తాయి.
దాల్చిన చెక్క
మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ముఖ్యమైనది. ఇది ఇన్సులిన్ కణాలను సున్నితంగా మార్చే ఆహారం. దాల్చిన చెక్కను పొడి చేసి ఆహారంలో కలుపుకుని తినడం లేదా దాల్చిన చెక్కతో టీ చేసుకుని తాగడం చేస్తే చాలా మంచిది.
కాకరకాయ
కాకరకాయను చూస్తే చాలా ముఖం ముడుచుకుంటారు కానీ డయాబెటిక్ రోగులకు చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పాంక్రియాస్‌ను ఉత్తేజపరిచి ఇన్సులిన్ విడుదలయ్యేలా చేస్తుంది. కాకరకాయ కూరనే కాదు, కాకరకాయ రసాన్ని తాగితే ఎంతో మేలు. ఉసిరి రసంలో కాకర రసాన్ని కలుపుకుని తాగితే త్వరగా మధుమేహం కంట్రోల్ అవుతుంది.
మెంతులు
మెంతిగింజలు మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి. మెంతి పొడిని నీళ్లలో కలుపుకుని రోజూ తాగితే డయాబెటిస్ లక్షణాలు అదుపులోకి వచ్చేస్తాయి. ఈ గింజల్లో ట్రైగోనెల్లైన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆ గింజలను రాత్రంతా నీటిలో నానెబట్టి, ఉదయం ఆ నీటిని తాగితే ఆరోగ్యపరంగా చాలా మార్పు కనిపిస్తుంది. తాగలేకపోతే కూరల్లో కలిపి వండుకుని తినాలి.
పసుపు పొడి
తెలుగువారి ఇళ్లల్లో కచ్చితంగా ఉండే పదార్థం పసుపు పొడి. ఇది ఒక సమ్మేళనం. దీన్ని కూరల్లో కలుపుకుని తినడం వల్ల నేరుగా పాంక్రియాటిక్ బీటా కణాలపై అది ప్రభావం చూపిస్తుంది. ఇన్పులిన్ పెంచడానికి సహాయపడుతుంది.
Also read: కరోనాలాగే లాంగ్యా వైరస్ కూడా ప్రపంచాన్ని వణికిస్తుందా? లక్షణాలు ఎలా ఉంటాయంటే
Also read: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.