ప్రశ్న: మాది ప్రేమ వివాహం. పెళ్లి చేసుకోవడానికి ముందు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నాం. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాం అనుకున్నాకే పెళ్లి చేసుకున్నాం. హనీమూన్‌కు ఆమెకు నచ్చిన ప్రదేశానికే తీసుకువెళ్లాను. ఆ తర్వాత జంటగా మా సాధారణ జీవితం మొదలైంది.  పెళ్లయ్యాక మెల్లగా ఆమె మార్పులు కనిపించసాగాయి. ప్రేమికురాలిగా ఎంతో కంఫర్ట్‌గా ఉన్న ఆమె, భార్యగా మాత్రం విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. నన్ను ఏ అమ్మాయితోనూ మాట్లాడనివ్వదు, ఒకవేళ మాట్లాడితే ఆమెకూ నాకూ ఉన్న అనుబంధం గురించి ఆరా తీస్తుంది. నేను ఎన్నిసార్లు ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను,  చాట్ చేశాను... అనే వివరాలు అన్నీ వెతుకుతుంది. ఆఫీసులో మా బాస్ ఒక మహిళ. ఆమె అర్జెంటు పని మీద పిలిచినా కూడా వెళ్ళనివ్వదు. పైగా నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకునేందుకు నన్ను అనుసరిస్తుంది. మీ బాస్ ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? ఎంత ఎత్తు ఉంటుంది? ఎంత లావు ఉంటుంది? ఇలాంటి వివరాలను అడుగుతూ విసిగిస్తుంది. చివరికి సొంత ఫ్యామిలీలోని కజిన్స్‌తో కూడా మాట్లాడకూడదు. వాళ్లతో నేను మాట్లాడాలంటే, నా భార్య పక్కన ఉండాల్సిందే. ఒకరోజు షాపింగ్ మాల్‌లో స్నేహితురాలు కనిపించింది. పలకరించి, మాట్లాడాను. ఇంటికి వచ్చాక నేను ఆమెతో ఎంత తరచుగా మాట్లాడుతున్నానో వాట్సాప్ చెక్ చేస్తోంది. ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగితే, నువ్వంటే నాకు ప్రేమ అంటుంది.  ఆమె ప్రవర్తనతో నాకు విసుగ్గా ఉంది. ఊపిరి ఆడనట్టుగా అవుతోంది. ఇలా జీవితాంతం బతకాలంటే భయమేస్తోంది. ఆమెను మార్చడం ఎలా?


జవాబు: మీది ప్రేమ వివాహం అని చెప్పారు. నాలుగేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నామని చెప్పారు. ఆ నాలుగేళ్లలో ఆమె ప్రవర్తన పై మీకు ఏమాత్రం అనుమానం రాలేదా? ఆమె అప్పుడు కూడా ఇతర ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇబ్బందిగా ఫీలైనట్టు అనిపిస్తే, మీరు పెళ్లికి ముందే ఆ విషయంపై మాట్లాడుకుంటే బాగుండేది. ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధం నిలబడాలంటే దానికి నమ్మకం ముఖ్యం. కానీ ఆమెకు మీ మీద నమ్మకం లేదు. ఆ నమ్మకం పోవడానికి మీరు ఏదైనా తప్పు చేశారేమో ఒకసారి విశ్లేషించుకోండి. లేదా కొందరికి అనుమానం అనే మానసికమైన వ్యాధి ఉంటుంది. ఒకవేళ ఆమెకు ఆ వ్యాధి ఉంటే చికిత్స ఇప్పించవచ్చు. కానీ ఆ జబ్బు ఉందని ఆమె త్వరగా ఒప్పుకోవడం కష్టమే. 


మీరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పారు. అంటే ఒకరిపై ఒకరు మానసికంగా, భావోద్వేగాలపరంగా బాగా ఆధారపడ్డారు. ఆమె మీ కన్నా ఎక్కువగా ఆధారపడి ఉండొచ్చు. అందుకే మీపై ఎక్కువ ప్రేమను చూపిస్తోంది. మీ భార్యని కూర్చోబెట్టి,  మీ జీవితంలో ఆమెకు తప్ప వేరే వాళ్లకు చోటు ఉండదని వివరించి చెప్పండి. నమ్మకాన్ని కలిగించడానికి ఏం చేయాలో అడగండి. ఆమె భావోద్వేగాలకు విలువనివ్వండి. మీరు చెప్పిన ప్రకారం ఆమె ఓవర్ పొసెసివ్‌నెస్‌తో బాధపడుతోంది.  కౌన్సిలింగ్ ద్వారా దాన్ని పోగొట్టవచ్చు. కాబట్టి ఆమెకు మానసిక వైద్య నిపుణులు చేత కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిది. కౌన్సిలింగ్ ద్వారా కొంతమేరకు ఆ లక్షణాలు తగ్గవచ్చు. 



Also read: ధూమపానంతో కంటిచూపుకు పొంచి ఉన్న ప్రమాదం - త్వరగా కంటి శుక్లాలు వచ్చే అవకాశం