Sudha Reddy At Met Gala 2024 Event: ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా మెట్ గాలా ఈవెంట్ సెలబ్రిటీలతో నిండిపోయింది. సినిమా, స్పోర్ట్స్, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖలతో కళకళలాడింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న సెలబ్రిటీలు అద్భుతంగా ముస్తాబై ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో మెట్ గాలా 2024 ఈవెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.


స్పెషల్ అట్రాక్షన్ గా హైదరాబాద్ బిజినెస్ ఉమెన్ సుధా రెడ్డి


మెట్ గాలా 2024 ఈవెంట్ లో హైదరాబాదీ వ్యాపారవేత్త సుధా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐవరీ సిల్క్ గౌన్‌లో మెట్ గాలా ఈవెంట్‌కు హాజరయ్యారు. సినీ తారలను తలదన్నే ఫ్యాషన్ వేర్ తో అందరినీ ఆకట్టుకున్నారు. సిల్క్ గౌన్ తో పాటు ఆమె ధరించిన డైమండ్ ఆభరణాలు స్పెషల్ అట్రాక్షన్ గా అలరించాయి. మెట్ గాలా ఈవెంట్ సందర్భంగా  సుధారెడ్డి ‘అమోర్ ఎటెర్నో’ అనే జ్యువలరీ బ్రాండ్‌కు చెందిన డైమండ్ నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్ లెస్ 180 క్యారెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. 25 క్యారెట్ హార్ట్ షేప్ డైమండ్‌ లాకెట్‌తో పాటు మరో మూడు 20 క్యారెట్ల హార్ట్ షేప్ డైమండ్స్ కూడా ఉన్నాయి. ఆ మూడు హార్ట్స్‌ ను తన భర్త, ఇద్దరు పిల్లలు మానస్, ప్రణవ్‌ కు గుర్తుగా ధరించారట సుధా రెడ్డి. నెక్లెస్ మాత్రమే కాదు సుధా రెడ్డి చేతికి ఉన్న 2 ఉంగరాలు కూడా డైమండ్ తోనే తయారు చేశారట. అందులో ఒకటి 23 క్యారెట్ డైమండ్ రింగ్ కాగా, మరొకటి 20 క్యారెట్ డైమండ్ రింగ్. సుధారెడ్డి ధరించిన ఉంగరాల ధర సుమారు 20 మిలియన్లు (భారత కరెన్సీలో రూ.165 కోట్లు) ఉంటుందని తెలుస్తోంది. సుధా ధరించిన ఐవరీ సిల్క్ గౌన్‌ను తయారు చేయడానికి 80 మంది డిజైనర్లు,  4,500 గంటలు కష్టపడ్డట్లు తెలుస్తోంది.


ఎవరీ సుధారెడ్డి?


సుధారెడ్డి హైదరాబాదీ వ్యాపారవేత్త. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.  సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. యునిసెఫ్, గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఫైట్ హంగర్ ఫౌండేషన్ కు సంబంధించిన సేవా కార్యక్రమాల్లో సుధా చురుగ్గా పాల్గొంటారు. ఈమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సుధారెడ్డి దగ్గర అత్యంత విలువైన జ్యువలరీతో పాటు గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ సహా పలు లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది.  


మెట్ గాలా ప్రత్యేకత ఏంటి?


మెట్ గాలా అనేది సెలబ్రిటీలు డిజైనర్ వేర్ లలో కనిపించే పాపులర్ ఈవెంట్. ప్రతి ఏడాది మే తొలివారంలో ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. ఈ ఈవెంట్ ను మ్యాజియం కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం డబ్బు సేకరించేందుకు ఏర్పాటు చేస్తారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు పాల్గొంటారు. మెట్ గాలాకు హాజరైన అతికొద్ది మంది ఇండియన్స్ లో సుధారెడ్డి ఒకరు. 2021లోనూ ఆమె ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. తాజాగా ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.






Read Also: జిమ్‌‌కు వెళ్తే జ్వరమొస్తాది, వ్యాయామం వల్ల కాదు.. ఇవిగో ఈ కారణాల వల్ల, జర భద్రం!