HPV Vaccine for Boys : గర్భాశయ క్యాన్సర్​ను నివారించడానికి 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలికలకు టీకాలు వేయడాన్ని ప్రోత్సాహిస్తున్నట్లు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ తెలిపారు. వెంటనే పూనమ్ పాండే ఈ వ్యాక్సిన్ ప్రమోషన్​ను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఎవరూ ఊహించని విధంగా ఆమె చనిపోయినట్లు నాటకమాడి.. అందరినీ టెన్షన్ పెట్టి.. చివరికి హ్యూమన్ పాపిల్లోమావైరస్​ గురించి అందరికీ అవగాహన కలిపిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకేనా?


ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా..


గర్భాశయ క్యాన్సర్ రాకుండా నిరోధించే హ్యూమన్ పాపిల్లోమావైర్స్ (HPV) వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకేనా అంటే కచ్చితంగా కాదు అంటున్నారు నిపుణులు. సాధారణంగా గర్భాశయ క్యాన్సర్​ అంటే కేవలం అమ్మాయిలకి మాత్రమే అనే భ్రమలో ఉంటున్నారని.. ఈ వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా వేయాలని చెప్తున్నారు. 2006లో తొలిసారిగా HPV వ్యాక్సిన్​ని ఆమోదించారు. 9 నుంచి 26 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు దీనిని ఇచ్చేవారు. అయితే 2009లో అబ్బాయిల కోసం HPV టీకాను ఆమోదించారు. 


పురుషుల్లో ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ


HPV టీకాను అబ్బాయిల కూడా వేయించుకోవాలి అంటున్నారు ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తొమ్మిది రకాల HPVలను కవర్ చేస్తుంది. కాబట్టి గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం లేని అబ్బాయిలు కూడా ఈ టీకాను వేయించుకోవాలి అంటున్నారు. HPV అనేది లైంగిక సంక్రమణ. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్​కు, పురుషులలో పురుషాంగ క్యాన్సర్​.. స్త్రీ, పురుషులలో గొంతు, నాలుక, టాన్సిల్​ క్యాన్సర్లకు కారణమవుతుంది. వీటి లక్షణాలు త్వరగా బయటపడవు. వైరస్​కు గురైన కొన్నేళ్లకు ఇవి బయటపడవచ్చు. అవి ప్రాణాంతకం కూడా అవుతాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్ బాలురు, బాలికలకు వేయిస్తే వారిని ఈ క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. 


ప్రతి పదిమందిలో నలుగురు మగవారికి..


HPV సంబంధిత క్యాన్సర్​ వచ్చే ప్రతి 10 కేసులలో నలుగురు మగవారు ఉంటున్నారు. ప్రస్తుతం పురుషులలో ఈ క్యాన్సర్​లకు స్క్రీనింగ్​ లేదు. చికిత్స కూడా లేదు. కాబట్టి వ్యాక్సిన్​తో మాత్రమే ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చు. HPV టీకాను 9 నుంచి 26 సంవత్సరాల ఉన్న స్త్రీ, పురుషులందరికీ సిఫార్సు చేస్తున్నారు. మొదటి డోస్​ నుంచి రెండో డోస్​కి 6 నుంచి 12 నెలల తేడా ఉంటుంది. 


వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?


HPV వ్యాక్సిన్​ క్యాన్సర్ నిరోధక ప్రయోజనాలు అందిస్తుంది. వీటిని అన్నిరకాలుగా పరీక్షలు చేసిన తర్వాతే టీకాగా అందిస్తారు. కాబట్టి ప్రతికూల చర్యలు ఏమి ఉండవు. జలుబు, ఫ్లూ వంటి వాటికి తీసుకునే వ్యాక్సిన్​ల మాదిరిగానే.. దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి. నొప్పి, ఎరుపు, వాపు, కందడం వంటివి జరుగుతాయి అంతే. అవి కూడా తీవ్రమైనవి కావంటూ తెలిపారు. HPV టీకాను లైంగికంగా పాల్గొనకముందే ఇస్తే చాలా మంచిది. ఒకవేళ లైంగికంగా చురుకుగా ఉన్నా.. ఈ టీకా వైరస్​ల నుంచి రక్షించగలదు. 


Also Read : బడ్జెట్​ సెషన్​లో గర్భాశయ క్యాన్సర్ ప్రస్తావన.. వ్యాక్సిన్ వేయించుకోకుంటే అంత ప్రమాదమా?
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.