Andhra Pradesh Elections 2024: సీఎం జగన్మోహన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో వై నాట్‌ 175 నినాదంతో ముందుకు వెళుతున్నారు. అందుకు అనుగుణంగానే సర్వేలు చేయిస్తూ గెలుపు గుర్రాలను బరిలో దించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, వైసీపీలో నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి ముప్పు తెచ్చేలా కనిపిస్తున్నాయంటూ కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నేతలు మధ్య విభేధాలు ఉన్న నియోజకవర్గాలు జాబితాలో విశాఖలోని తూర్పు నియోజకవర్గం ఒకటిగా చెబుతున్నారు. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. కానీ, ఈయనకు స్థానిక నేతలు ఆశించిన స్థాయిలో సహకారాన్ని అందించడం లేదన్న ప్రచారం ఉంది.


గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న అక్కరమాని విజయ నిర్మల, ఆయన భర్త వెంకటరావు గడిచిన కొన్నాళ్లు నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భీమిలిలో నిర్వహించిన తొలి సిద్ధం సభకు కూడా ఈ దంపతులు హాజరు కాలేదు. అలాగే, ఇదే నియోజకవర్గ పరిధిలో ఉంటున్న మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి దంపతులు కూడా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో అంటీ, ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎంపీ ఎంవీవీని తూర్పు ఇన్‌చార్జ్‌గా నియమించిన తరువాతే వైసీపీలో కొన్నాళ్లు నుంచి ఉన్న ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌.. బయటకు వెళ్లిపోయి జనసేనలో చేరారు. ఈ వ్యవహారాలన్నీ తూర్పు వైసీపీలో కొంత ఇబ్బందికరంగా కనిపిస్తున్నట్టు కేడర్‌ చెబుతోంది. 


హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేకు ధీటైన అభ్యర్థిగా ఎంవీవీ


విశాఖ నగర పరిధిలోని తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహరిస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల్లోనూ ఈయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఎమ్మెల్యే వెలగపూడి చేతిలో రెండు సార్లు వంశీకృష్ణ శ్రీనివాస్‌, ఒకసారి అక్కరమాని విజయనిర్మల ఓటమి చవి చూశారు. సిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడంతోపాటు ఎమ్మెల్యే వెలగపూడి వ్యక్తిగత ఇమేజ్‌ ఆయన విజయానికి దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వెలగపూడిని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం.. ఇందుకోసం బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని భావించింది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా బలంగా ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇక్కడ ఇన్‌చార్జ్‌గా నియమించింది.


పార్టీ అప్పగించిన బాధ్యతలు మేరకు ఎంవీవీ సత్యనారాయణ తొలి రోజు నుంచే క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ కేడర్‌ను కూడా తన వెంట నడిచేలా చేస్తున్నారు. కానీ, ఇంటి పోరు ఆయనకు ఎంత వరకు ఇబ్బందిని కలిగిస్తుందన్నది తెలియడం లేదు. మొన్నటి వరకు ఉప్పు, నిప్పులా ఉన్న వెలగపూడి, వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఇప్పుడు ఒకే వేదికపైకి (కూటమి) చేరినట్టు అయింది. వీరిద్దరిని తట్టుకుని ఢీ కొట్టడం ఎంవీవీ సత్యనారాయణకు అంత సులభమేమీ కాదు. కానీ, వైసీపీ ప్రభుత్వం చేసిన మేలు కలిసి వస్తుందని ఆయన చెబుతున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి మాదిరిగానే ప్రజలతో మమేకం కావడం, అందరికీ అందుబాటులో ఉంటాడన్న పేరు తెచ్చుకోవడం కూడా ఎంపీకి కలిసి వస్తుందని చెబుతున్నారు. 


ఆ నేతల ఆలోచన ఏమిటి..?


తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను నియమించినప్పటి నుంచి నిరాశలో కూరుకుపోయారు ఇక్కడి తాజా మాజీ ఇన్‌చార్జ్‌ అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి. ఈ ముగ్గురు నేతలు వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ, అధిష్టానం నుంచి ఆ దిశగా హామీ లభించకపోవడంతోపాటు ఎంపీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్‌ పార్టీ మారిపోయారు. పార్టీలోనే ఉన్నప్పటికీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న అక్కరమాని దంపతులు, మేయర్‌ దంపతులు మాత్రం మధ్యస్తంగా మెలుగుతూ రాజకీయాలను నెరుపుకుంటూ పోతున్నారు. తూర్పులో కాకపోయినా గాజువాకలో అయినా అవకాశం ఇవ్వాలని మేయర్‌ దంపతులు అధిష్టానాన్ని కోరుతున్నారు. విశాఖ నగరంలో కీలకమైన తూర్పు నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న అసంతృప్తులను అధిష్టానం ఎంత వరకు సమసిపోయేలా చేస్తుందో.