గురకను చాలా చిన్న సమస్యగా తీసేస్తారు కానీ అది ఎక్కువ మందినే వేధిస్తుంది. శ్వాసమార్గం సంకోచించడం వల్ల కలిగే శబ్ధం అది. ఇది ఒక్కోసారి పెద్ద సమస్యలకు కారణంగా మారుతుంది. నిద్రలేమితో పాటూ గుండె సంబంధిత సమస్యలకు కూడా కారణం కావచ్చు. గురకను తగ్గించే మందులు మార్కట్లోకి ఇంకా రాలేదు. కొన్ని పరికరాలు మాత్రం వచ్చాయి. అవి కూడా అంతగా పనిచేస్తున్నట్టు కనిపించకపోవడం పెద్దగా వాటిని ఎవరూ పట్టించుకోలేదు.కొన్ని చిట్కాల ద్వారా గురకను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది.
ఇలా చేయండి...
అధిక బరువు ఉన్న వారిలో కచ్చితంగా గురక వస్తుంది. ఎందుకంటే లావుగా ఉండే వారి శ్వాస మార్గం నిద్ర సమయంలో మరింతగా కుచించుకుపోతుంది. కాబట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించండి. మీరే గమనించవచ్చు బరువు తక్కువగా ఉన్నవారిలో గురక వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే మీరు పడుకున్న గదిలో తేమ లేకపోవడం వల్ల కూడా ముక్కు దిబ్బడ కట్టచ్చు. దాని వల్ల కూడా గురక రావచ్చు. గదిలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.
నిద్రపోయేటప్పుడు తల భాగాన్ని 45 డిగ్రీల ఎత్తులో పెటుకోవాలి. అంటే రెండు మెత్తని తలగడలు వేసుకుని పడుకుంటే మంచిది. తలభాగం ఎత్తుగా ఉండడం వల్ల గురక వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. పూర్తిగా రాదని మాత్రం చెప్పలేం. గదిలో దుమ్మూ ధూళి వంటివి లేకుండా చూసుకోండి. వాటి వల్ల గురక రావడానికి అవకాశం ఉంది.
నోరు మూసి గురకపెడితే...
గురక పెట్టినప్పుడు చాలా మంది నోరు తెరిచే పెడతారు. ఇలా గురకపెడుతున్నారంటే గొంతు భాగంలో సమస్య ఉన్నట్టు. కాబట్టి వీరు ప్రాణాయామం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కొంతమంది మాత్రం నోరు మూసుకుని గురక పెడతారు. అలా గురక పెడితే ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి. గొంతు కణజాలంలో సమస్య ఉన్నప్పుడే నోరు తెరిచి గురక పెడతారు.
అవి మానేయండి...
ధూమపానం, మద్యపానం ఈ రెండు అలవాట్లు చాలా అనారోగ్యాలకు కారణాలు. అలాగే గురక అధికంగా రావడానికి, బరువు పెరగడానికి కూడా ఇవి కారణాలు. కాబట్టి ఈ రెండింటినీ ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. శరీరానికి ఆల్కహాల్ పూర్తిగా నష్టమే చేస్తుంది. కేవలం కొన్ని క్షణాల కిక్కు కోసం తాగితే ఆరోగ్యం గుల్ల అయిపోవడం ఖాయం.
Also read: వేసవిలో రాగి అంబలి ఇలా చేసుకుని తాగితే ఎంతో చలువ, వడదెబ్బ కొట్టదు
Also read: మగవారు కచ్చితంగా తినాల్సినవి గుమ్మడి గింజలు, రోజుకో గుప్పెడు తింటే వీర్యకణాల వృద్ధి