అల్పాహారంగా దోశెలు, పూరీలు, వడలు, బోండాలు లాగిస్తున్నారా? వేసవిలో అలాంటి ఆహారాలు ఉదయానే తినడం వల్ల దాహం పెరిగిపోతుంది. నాలుక తరచూ ఎండిపోతుంది. నూనె వాడిన ఆహారాను ఉదయం పూట తినకపోవడమే మంచిది. అసలే ఎండలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ నెలలో ఎండలకే ప్రజలు ఠారెత్తి పోయారు. ఇప్పుడు మే నెలలో రోళ్లు పగిలేలా ఎండలు కాయనున్నాయి. కాబట్టి ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలువ చేసే ఆహారాన్ని తినాలి. రాగి అంబలి తింటే చాలా మంచిది. దాన్ని ఈ విధంగా చేసుకుని తాగితే వేసవిలో బాగా చలువ చేస్తుంది. 


తయారీ ఇలా
1. రాత్రే రాగి సంగతి ముద్దను తయారు చేసుకుని పెట్టుకోవాలి. 
2. ఉదయాన ఆ ముద్దను తీసుకుని ఒక గిన్నెలో వేయాలి.  
3. చల్లని మజ్జిగలో ఉల్లిపాయల తరుగు, ఒక పచ్చిమిరపకాయ తరుగు, ఉప్పు వేసి కలపాలి. 
4. ఇప్పుడు రాగిముద్ద వేసిన గిన్నెలో మజ్జిగ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. 
5. తాగడానికి వీలుగా కావాల్సినంత మజ్జిగ పోసుకోవచ్చు. ఒక గ్లాసులో ఈ మిశ్రమాన్ని తీసుకుని తాగాలి. 
రాగి అంబలిని ఇలా తాగడం వల్ల శరీరంలో వేడి మొత్తం బయటికి పోతుంది. వడదెబ్బ కొట్టే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు వీటిల్లో ఉండే పోషకాలు కూడా పుష్కలంగా శరీరానికి అందుతాయి. రోజూ ఇలా రాగి అంబలి తాగి ఎండలో బయటికి వెళితే వడదెబ్బ కొడుతుందనే భయం ఉండదు. 


రాగిపిండిలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తం ఉత్పత్తికి సహకరిస్తుంది. రాగి అంబలిని పిల్లల చేత తాగిపిస్తే వారికి చాలా మేలు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఉపయోగకరమైనది. చాలా సేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది. తద్వారా ఇతర ఆహారాలు తినరు. తద్వారా శరీరంలో అదనపు కొవ్వు చేరదు. హైబీపీ, మధుమేహం రోగాలతో బాధపడుతున్నవారికి రాగి అంబలి తాగితే ఆ రెండూ నియంత్రణలో ఉంటాయి. ప్రతిరోజూ  అల్పాహారానికి బదులు దీన్ని తాగడం అలవాటు చేసుకుంటే రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. రాగుల్లో ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తుంది.అయితే ఈ ప్రొటీన్ చాలా ప్రత్యేకమైనది. ఈ రకం ప్రొటీన్ మిగతా ఆహారాల్లో లభించదు. వీటిలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు గట్టిగా మారతాయి, కాబట్టి మహిళలు రాగి అంబలి తాగితే చాలా మంచిది. వారికి 30 ఏళ్లు దాటాక ఎముకల పటుత్వం తగ్గిపోతుంది. 


Also read: మగవారు కచ్చితంగా తినాల్సినవి గుమ్మడి గింజలు, రోజుకో గుప్పెడు తింటే వీర్యకణాల వృద్ధి


Also read: నిద్ర పెంచినా తగ్గించినా సమస్యే, డయాబెటిస్ వచ్చే ఛాన్స్