మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది కత్తి మీద సాములాంటిదే. తీసుకునే ఆహారం దగ్గర నుంచి జీవనశైలి అలవాట్లు వరకు ప్రతి ఒక్కటీ మధుమేహాన్ని నియంత్రణలో లేకుండా చేస్తుంది. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో డయాబెటిస్ బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి గాలుల వల్ల అలసటతో పాటు అనేక సవాళ్లను సృష్టిస్తుంది. అందుకే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవడానికి సరైన కార్యాచరణ రూపొందించుకోవడం చాలా ముఖ్యం. మధుమేహం నిర్వహణలో ఆరోగ్యకరమైన దినచర్య కీలకం. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు చెక్ చేసుకోకపోవడం వంటి వాటి వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హీట్ వేవ్ ఉన్నప్పుడు మధుమేహులు డీహైడ్రేషన్ కి గురవుతారు. ఈ వేసవి కాలంలో మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూ వేడి గాలుల నుంచి రక్షణ పొందాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.


ద్రవాలు తీసుకోవాలి


ఆరుబయట ఎక్కువ సమయం గడిపితే డీహైడ్రేషన్ బారిన పడతారు. దీన్ని నివారించడానికి దాహం వేయకపోయినా పుష్కలంగా నీరు, తాజా పండ్ల రసాలు, కెఫీన్ లేని పానీయాలు తాగాలి. ఆల్కహాల్, కెఫీన్ నివారించేటప్పుడు కొబ్బరి నీరు, చక్కెర లేకుండా నిమ్మరసం, లస్సీ లేదా మజ్జిగ వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.


ఎండ వేడికి దూరంగా ఉండాలి


మధుమేహం ఉన్న వాళ్ళు ఎండ వెదికి ఎక్కువగా ఉంటే త్వరగా అలసటకి గురయ్యే ప్రమాదం ఉంది. మైకం, చెమటలు పట్టడం, కండరాల తిమ్మిరి, మూర్ఛ, తలనొప్పి, హృదయ స్పందన రేటు పెరిగిపోవడం, వికారం, వాంతులు వంటివి సంభవిస్తాయి. ఈ లక్షణాలు మీరు అనుభవిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్ళి హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి.


షుగర్ లెవల్స్ చెక్ చేయాలి


ఎప్పటికప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎలా ఉన్నాయనే దానిపై నిఘా ఉంచుకోవాలి. ఎందుకంటే జీవనశైలిలో మార్పుల వల్ల ఈ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. 24 గంటల్లో కనీసం 17 గంటల పాటు గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంచేందుకు ప్రయత్నించుకోవాలి.


వ్యాయామం


విశ్రాంతి వేసవికి హాయినిస్తుంది. అయితే మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడేది వ్యాయామం. ఉదయం లేదా సాయంత్రం పుట కాసేపు ఇంటి బయట ఆవరణలో వ్యాయామం చేసుకోవచ్చు. కానీ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే మాత్రం ఇండోర్ జిమ్ లో చేసుకోవడం లేదా యోగా స్ట్రెచ్ ప్రాక్టీస్ చేయడం మంచిది.


బాగా తినాలి


వేసవిలో అంటే పిల్లలకు, యువతకు సెలవులు. దీంతో రెస్టారెంట్, బయట వంటకాలు తినేందుకు ఇష్టపడతారు. కానీ మధుమేహం ఉన్న వ్యక్తులు సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.


ఆహారంలో మార్పులు చేసుకుంటూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా సులభమైన పని అని నిపుణులు చెబుతున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!