కాస్త తలనొప్పి, ఒత్తిడిగా అనిపించినా మగవాళ్ళు బయటకి వెళ్ళి ఒక దమ్ము కొట్టేసి వస్తారు. మరికొంతమంది అయితే ఏమి టైమ్ పాస్ కాక గుప్పుగుప్పుమని పొగ లాగించేస్తారు. వాళ్ళకి అదొక సంతోషమని చెప్పుకుంటారు. కానీ ధూమపానం ఆరోగ్యానికి హాని కరమనే విషయం తెలిసినప్పటికీ అదే అలవాటు చేసుకుంటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని అది చాలా ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవే కాదు ఎంతో ముఖ్యమైన మీ కంటి చూపుని కూడా సిగరెట్ కాల్చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ధూమపానం వయసు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని పెంచుతుంది. కంటి శుక్లం, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, డ్రై ఐ సిండ్రోమ్ వంటి ఎన్నో వ్యాధులకు గురయ్యేలా చేస్తుంది.


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ధూమపానం చేసే కంటి సంబంధిత సమస్యలని ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ వ్యసనం వ్యక్తి కేంద్ర దృష్టిని తగ్గించేస్తుంది. చదవడం, డ్రైవింగ్ వంటి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టతరం చేస్తుంది. పొగ తాగేవాళ్ళు మాత్రమే కాదు వారి పక్కన ఉండే వాళ్ళకి కూడా కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం రెండు రేట్లు ఎక్కువగా ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. నేడు వరల్డ్ నో టోబాకో డే. ఈ సందర్భంగా పొగాకు వినియోగం వల్ల కలిగే అనార్థాల గురించి మరొక సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ధూమపానం కంటి చూపుని పోగొడుతుందా?


వైద్యులు చెప్పే దాని ప్రకారం సిగరెట్ తాగేటప్పుడు కంటి చూపు సరిగా ఉండేందుకు సహాయపడే కళ్ళలోని కొన్ని ముఖ్యమైన భాగాల మీద దాని ప్రభావం పడుతుంది. దీని వల్ల దృష్టి మందగించడం, కంటి చూపు పూర్తిగా కోల్పోయేలా చేయడం జరుగుతుంది.


కంటి శుక్లం


నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2-3 సిగరెట్లు తాగడం వల్ల కూడా కంటి శుక్లం వస్తుంది. కంటి లెన్స్ మసకబారిపోవడాన్ని కంటి శుక్లం అంటారు. ఇది రెటీనా నుంచి కాంతిని లోనికి వెళ్ళకుండా నిరోధిస్తుంది. ఇది నెమ్మదిగా పురోగమిస్తుంది. కంటి నరాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల దృష్టి అస్పష్టంగా అనిపించడం, రంగులు గుర్తించలేకపోవడం, కళ్ళు పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది.


కంట్లో మచ్చలు


ధూమపానం వయసు సంబంధిత మాక్యూలర్ డీజెనరేషన్ అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది. ధూమపానం చేయని వారితో పోలిస్తే ఈ అలవాటు ఉన్న వారిలో ఈ వ్యాధి ప్రమాదం నాలుగు రేట్లు ఎక్కువ. మాక్యులా అనేది సున్నితమైన భాగం. చూపు సరిగా ఉండేలా చేస్తుంది. ధూమపానం వల్ల మాక్యూలా నాశనం అవుతుంది. పొగ యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. మాక్యూలాలోని లుటిన్ స్థాయిలను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. సిగరెట్ పొగ రెటీనాకు ఆక్సిజన్ సరఫరా చేసే రక్తనాళాల పరిమాణాన్ని తగ్గిస్తుంది.


గ్రేవ్స్ ఆప్తాలోపతి


పొగాకు వినియోగం థైరాయిడ్ పనితీరుపై అనేక రకాల ప్రభావాలను చూపుతుంది. గ్రేవ్స్ వ్యాధి లేదా థైరాయిడ్ వల్ల కలిగే కంటి వ్యాధులకు కారణం కావచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.


డయాబెటిక్ రెటినోపతి


ధూమపానం చేసే వారికి డయాబెటిస్ రెటినోపతి వచ్చే ప్రమాదం కూడా ఉండి. ఈ పరిస్థితిలో కంటిలోని రక్త నాళాలు దెబ్బతింటాయి. దీని వల్ల చూపు కూడా కోల్పోవచ్చు.


ధూమపానం వల్ల కలిగే కంటి వ్యాధుల లక్షణాలు


⦿అస్పష్టమైన దృష్టి


⦿రంగులు సరిగా చూడలేకపోవడం


⦿కాంతిని చూడలేకపోవడం


⦿రాత్రి వేళ చూపు మందగించడం


⦿డబుల్ విజన్


⦿ముఖాలను గుర్తించడం కూడా కష్టమవడం   


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!