రంగులు చల్లుకునే హోలీ అంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం. అయితే బయట దొరికే రంగులో రసాయనాల సమ్మిళితం. అవి కళ్లలో పడినా, ముక్కులోకి పీల్చినా, అనుకోకుండా పొట్టలోకి చేరినా కొన్ని రకాల ఆరోగ్యసమస్యలు తప్పవు. అందుకే రసాయనాలు కలిసిన ఆ రంగులతో కాకుండా ఇంట్లోనే తయారుచేసిన సేంద్రియ రంగులతో హోలీ ఆడుకుంటే ఎలాంటి సమస్యలు రావు. ఇంట్లోనే రంగులు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోండి. ఇది చాలా సులభమైన పద్ధతి కూడా. 


పసుపు రంగు
పసుపు రంగు కోసం ఇంట్లో ఉన్న పసుపు పొడి, శెనగపిండి కలపాలి. ఆ రెండింట్లో శెనగపిండి 80 శాతం, పసుపు పొడి 20 శాతం తీసుకోవాలి. రెండింటినీ బాగా కలిపి వాడుకోవచ్చు. 


ఎరుపు రంగు
ఎరుపు రంగు కోసం కూడా పసుపు పొడిని తీసుకోవాలి. అందులో నిమ్మరసం కలిపితే అది ఎరుపు రంగులోకి మారుతుంది. దీన్ని ఒక పళ్లెంలో వేసి స్ప్రెడ్ చేసి గాలికే ఆరబెట్టాలి. ఎండిపోయాక చూస్తే అది ఎరుపు రంగులో ఉంటుంది. 


పింక్ రంగు
ఎరుపు రంగును ఎలా తయారుచేశామో గులాబీ రంగును కూడా అలాగే చేయాలి. కాకపోతే నిమ్మరసాన్ని కాస్త తక్కువగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే ఎరుపు రంగు,తక్కువ కలిపితే పింక్ రంగుగా మారుతుంది. 


ఆకుపచ్చ రంగు
ఆకుపచ్చ రంగు కోసం మైదా పిండికి మెహెందీని కలపాలి. ఆ రెండింటినీ సమభాగాల్లో తీసుకోవాలి. మెహెందీ పొడిని వాడితే మంచిది. 


బ్రౌన్ రంగు 
రెండు వందల గ్రాముల కాఫీ పొడిని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. నీరు బ్రౌన్ రంగులోకి మారే వరకు మరిగించాలి. ఆ నీళ్లు చల్లారాక అందులో కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి.పొడిపొడిగా కలుపుకున్నాక పళ్లెంలో గాలికి ఆరబెట్టాలి.ఎండాక చేతులతో నలిపి మెత్తటి పొడిలా చేసుకోవాలి. 


హోలీ రోజు చల్లుకోవడానికి నాలుగైదు రంగులు సరిపోతాయి. శరీర ఆరోగ్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలపై రసాయనాలు అధిక ప్రభావం చూపిస్తాయి కాబట్టి, వారికి ఈ సేంద్రియ రంగులను ఇవ్వండి. కళ్లలో పడినా శుభ్రం చేస్తే పోతుంది. పెద్ద ప్రభావం ఏమీ చూపించదు. 


Also read: వేసవి సెలవుల్లో హంపి ట్రిప్ అదిరిపోతుంది, అక్కడ కచ్చితంగా చూడాల్సిన ప్రదేశాలు ఇవిగో


Also read: పరగడుపునే ఒక స్పూను నెయ్యి తాగమని ఆయుర్వేదం చెబుతోంది, ఎందుకు?


Also read: మహిళల సంతానోత్పత్తి వయసును పెంచే పరిశోధన విజయవంతం, త్వరలో వృద్ధాప్యంలోనూ పిల్లల్ని కనొచ్చు