ర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాల భయం  మొదలైపోతుంది. వాతావరణం మారితే ముందుగా మనల్ని జలుబు పలకరించేస్తుంది. ఆ వెంటనే నేను ఉన్నానంటూ జ్వరం కూడా వస్తుంది. అందుకే వాటి నుంచి మనం బయటపడాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జలుబు ఇంట్లో ఒక్కరికీ వచ్చిందంటే చాలు అందరికీ అంటుకుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఇంట్లో దొరికే వాటితోనే జలుబు నయం అయ్యేలాగా చేసుకోవచ్చు. 


కంటినిండా నిద్ర


మానవ శరీరానికి సుమారు 8 గంటల నిద్ర అవసరం. కంటి నిండా నిద్రపోతే ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉండగలుగుతాం.  కంటి నిండా నిద్రపోవడం వల్ల మన శరీరం నుంచి సైటోకైన్స్ ప్రోటీన్స్  విడుదల అవుతాయి. ఇవి రోగనిరోధక శక్తి ని పెంపొందించడంతో పాటు ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.  


వ్యాయామం 


రోజూ  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మనం ఫిట్ గా ఉంటాం. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం  లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని జయించడంతో పాటు మన శరీరంలో తెల్ల రక్త కణాల ప్రసరణ వేగవంతంగా ఉంటుంది. అలా చేయడం వల్ల వచ్చే సాధారణ రోగాల నుంచి మనం తేలికగా బయటపడొచ్చు.


విటమిన్ డి 


మన శరీరానికి అవసరమైనంత విటమిన్ డి అందకపోతే వెంటనే అనారోగ్యానికి గురవుతాం. అందుకే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి పుష్కలంగా ఉండేవిధంగా చూసుకోవాలి. విటమిన్ డి తగ్గిందంటే రోగనిరోధక శక్తి తగ్గిందనే దానికి సంకేతం. డి విటమిన్ పొందడానికి మంచి మార్గం సూర్యకాంతి. రోజు పొద్దునే కాసేపు ఎండలో నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదే కాకుండా చేపలు, కోడిగుడ్లు వంటి పదార్దాలని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. 


మంచి ఆహారం 


ఆరోగ్యం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అన్నీ రకాల కూరగాయలు, పండ్లు తినాలి. సీజన్ వారీగా వచ్చే పండ్లు తప్పకుండా తీసుకోవాలి. ఆకుకూరలు రోజు తినడం ఆరోగ్యానికి మరీ మంచిది. వీటన్నిటి నుంచి లభించే  విటమిన్లు మన రోగనిరోధక శక్తి పెరగడానికి ఎంతో ఉపయోగపడతాయి. 


గ్రీన్ టీ, బ్లాక్ టీ 


యాంటీ ఆక్సిడెంట్స్ గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగడంలో యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. గ్రీన్ టీకి  కొద్దిగా నిమ్మకాయ జోడిస్తే మరీ మంచిది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రోజు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోండి. 


పరిశుభ్రత 


ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటితో పాటు మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అపరిశుభ్రంగా ఉంటే రోగాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందుకని బయట నుంచి వచ్చినప్పుడు చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడం చేయాలి. జలుబు చేసిన వారికి దూరంగా ఉండటం చాలా వరకు ఉత్తమం. 


పసుపు, మిరియాలపొడి 


జలుబు చేసిన సమయంలో పసుపు వేసుకుని పాలు తాగితే చక్కటి రిలీఫ్ దొరుకుతుంది. అందుకే జలుబు చేసింది అనగానే మన బామ్మలు పసుపు, శొంటి, మిరియాలు వేసుకుని పాలు,  కషాయం తాగమని చెప్తూ ఉంటారు. ఆరోగ్యానికి అవి చాలా మంచివి.  పసుపు యాంటీ ఆక్సిడెంట్ గా బాగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంపొందటమే కాక ఫ్లూని మన దారి చేరనివ్వదు. 


వర్షంలో తడవకండి 


వర్షంలో తడవకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ తడిచినా  వెంటనే శుభ్రంగా స్నానం చేసి తల ఆరబెట్టుకోవాలి. వేడి నీళ్ళల్లో పసుపు వేసి ఆవిరి పడితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: మెంతులతో మెరుపు తీగలా మారిపోతారు, బరువు తగ్గేందుకు ఇలా చేయండి





Also Read: పావురాలతో శ్వాసకోశ సమస్యలు? వాటితో ఎలాంటి సమస్యలు వస్తాయి?


గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, హెల్త్ ఆర్టికల్స్ నుంచి గ్రహించిన కొన్ని వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇది చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య ఉన్న మీరు డాక్టర్ సలహా, సూచనలు తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.