Eating Eggs Every Day : గుడ్డు ఆరోగ్యానికి మంచిదని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. వెజిటేరియన్స్ గుడ్ తినాలా? వద్దా? అనే నిర్ణయం నుంచి.. ఎగ్స్ అనేవి ఎవరైనా తీసుకోవచ్చు అనే రోజులు వచ్చాయి. అయినా సరే ఈ గుడ్డుని మాత్రం కొన్ని అపోహలు వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే అసలు గుడ్డు తినొచ్చా? లేదా? తింటే ఎన్ని తినొచ్చు.. దీనికి లిమిట్ ఉంటుందా అనే విషయాల్లో ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తారు. మరి ఈ ప్రశ్నలపై నిపుణులు ఎలాంటి సలహాలు ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకవిలువలతో నిండినది..
గుడ్లు పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. ప్రోటీన్ దీనిలో పుష్కలంగా ఉంటుంది. హెల్తీ కొలెస్ట్రాల్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్, సెలీనియం, అయోడిన్, వివిధ రకాల విటమిన్లు ఉంటాయి. అందుకే వీటిని సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ దీనిని తీసుకోవచ్చని చెప్తారు. ఉడకబెట్టుకుని తింటే గుడ్డు వల్ల కలిగే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయట. మరి గుడ్లు తినడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
కొలెస్ట్రాల్ పెంచుతుందా?
గుడ్లు అధిక కొలెస్ట్రాలక్కు కారణమవుతాయనే ఆలోచన గత కొంతకాలంగా ఉంది. ఎగ్స్‌లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఉండడం వల్ల వారానికి మూడు లేదా నాలుగు గుడ్లు మాత్రమే తీసుకోవాలని కొందరు ఇప్పటికీ భావిస్తున్నారు. మరి దీని గురించిన వాస్తవం ఏమిటి? ఈ రూమర్ ఎందుకు వచ్చిందంటే.. ఎగ్‌లోని కొలెస్ట్రాల్.. రక్తంలో కొలెస్ట్రాల్ పెంచుతుందని అనుకోవడం వల్లనే. అన్ని కొలెస్ట్రాల్‌లు చెడు కొలెస్ట్రాల్‌ని పెంచుతాయని కాదు. కొన్ని మంచి కొలెస్ట్రాల్‌ని కూడా అందిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం ఎంత నిజమో.. మంచి కొలెస్ట్రాల్‌ని శరీరానికి అందిచాలనేది కూడా అంతే నిజమంటున్నారు నిపుణులు.
అపోహలు మొదలైంది అప్పుడే..
వైద్యులే గుడ్లు తినకూడదని.. 1990లో ఓ స్టేట్మెంట్ పాస్ చేశారు. కానీ.. కణ ఆరోగ్యం, విటమిన్ డి, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి శరీర విధులకు అవసరమైన ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను గుడ్డు ద్వారా పొందవచ్చని వారు గుర్తించలేకపోవడం వల్లనే ఇది జరిగింది. అందుకే గుడ్డు వినియోగం తగ్గించమని, రోజుకు ఒకటి లేదా వారంలో మూడు లేదా నాలుగు గుడ్లు మాత్రమే తీసుకోవాలని సలహాలు ఇచ్చేవారు. కానీ కాలం గడిచేకొద్ది దీనిపై పరిశోధనలు పెరిగాయి. రోజూ గుడ్డు తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు సలహ ఇచ్చారు.
రోజుకు ఎన్ని గుడ్లు తినాలంటే..
సుమారు 2000 సంవత్సరం నుంచి.. గుడ్లపై అపోహాలు వదిలేశాయి. వైవిధ్యమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవడంలో భాగంగా రోజూ గుడ్డు తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. దీనిపై ఎలాంటి నిబంధనలు పెట్టలేదు కానీ.. వంశపారంపర్యంగా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు.. ఆహారంగా తీసుకునేవాటిలో కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేయమని సలహా ఇస్తున్నారు. దీనిలో భాగంగా కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు.. వారానికి మూడు గుడ్లు తీసుకుంటే సరిపోద్దని చెప్తున్నారు.
Also Read : రేవ్ పార్టీలో ఏమి చేస్తారో తెలుసా? పార్టీలకు, రేవ్ పార్టీలకు ఉన్న డిఫరెన్స్ అదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.