ధుమేహం, రక్తపోటు, స్థూలకాయం.. ఈ మూడు వ్యాధులు ప్రపంచంలో కంటే మన భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియా డయాబెటిస్ నిర్వహించిన ఒక అధ్యయనం గురించి ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీలో ప్రచురించారు. ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో అత్యధికంగా మధుమేహం, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలోనే అత్యధికులు ఈ రెండు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు.


మధుమేహం, ప్రీ డయాబెటిస్ వ్యాప్తి జాతీయ సగటు రేటు 11.4, 15.3 శాతం ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్ లో వీటి శాతం వరుసగా 13.5, 18.7 గా ఉందని పరిశోధకులు తెలిపారు. రాష్ట్రంలో హైపర్ టెన్షన్ రేటు 35.3 శాతం ఉంది. జాతీయ సగటు 35.5 శాతం కంటే కొంత తక్కువ. మరోవైపు రాష్ట్రంలో ఊబకాయం రేటు కూడా జాతీయ గణాంకాల కంటే చాలా ఎక్కువ. 38.7 శాతం రాష్ట్ర వాసులు ఊబకాయంతో బాధపడుతున్నారు. జాతీయ స్థాయిలో 28.6 శాతం ఉండగా ఊబకాయం జాతీయ స్థాయిలో 39.5 శాతం నుంచి 56.1 శాతం వరకు ఉంది.


గత దశాబ్ద కాలంగా ఈ వ్యాధుల ప్రాబల్యం కొలిచేందుకు ఇటువంటి స్థాయిలో అధ్యయనం జరగలేదు. కొన్ని దశాబ్దాల క్రితం పాఠశాల విద్యార్థుల్లో టైప్ 2 డయాబెటిస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా మధుమేహం పెరుగుతోంది. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం కొన్ని దశాబ్దాల క్రితమే పుంజుకోవడం ప్రారంభించాయని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకులు వెల్లడించారు. శారీరక శ్రమ లేకపోవడం ఈ వ్యాధుల పెరుగుదలకు అత్యంత పెద్ద కారణంగా భావిస్తున్నారు.


ఒకప్పుడు ఇంట్లో, తోటల్లో పనులు సొంతంగా చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పని సులభం చేసే పరికరాలు వచ్చిన తర్వాత శారీరక శర్మ తగ్గిపోయింది. ఇతర పనులకు కూలీలు దొరుకుతున్నారు. దీని వల్ల శరీరానికి సరైన శ్రమ లేకపోవడంతో బద్ధకం పెరిగిపోయింది. రోజుకి కనీసం 60 నిమిషాల పాటు శరీరాన్ని శ్రమ పెట్టె విధంగా పనులు చేయడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.


ప్రజలు ఆర్థికంగా మెరుగుపడటంతో పాటు వారి జీవనశైలి నిశ్చలంగా మారిపోతుంది. ఈ వ్యాధుల ప్రభావం పెరుగుదలకి దారి తీస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గతంలో వెల్లడించిన నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు 10 కోట్ల మంది మధుమేహ రొగులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. భారతదేశాన్ని ఇప్పటికే డయాబెటిస్‌కు రాజధానిగా పిలుస్తున్నారు. హైపర్ టెన్షన్, స్థూలకాయం, హైపర్ కొలస్ట్రొలేమియా వంటి వాటి వల్ల మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం భారతదేశం, అమెరికా, చైనా దేశాల్లోనే అత్యధికంగా మధుమేహం బారిన పడుతున్న వారి జనాభా ఉంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులో ఉంచుకోవడమే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: కడుపు బాగుంటేనే మనసు బాగుంటుంది - అర్థం కాలేదా? నిపుణులు ఏం చెప్పారో చూడండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial