ధుమేహ వ్యాధిగ్రస్తులు తమ జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పదే పదే సూచిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అది ఇతర అవయవాలని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల శారీరక రోజువారీ పనులు సరిగ్గా నిర్వర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్త చక్కెర స్థాయి మూత్రపిండాల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. సరైన సమయానికి దీన్ని గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం కావచ్చు.


అసలు డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటి?


మయో క్లినిక్ లెక్కల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో ముగ్గురిలో ఒకరు డయాబెటిక్ నెఫ్రోపతితో బాధపడుతున్నారు. ఇది శరీరం నుంచి వ్యర్థ పదార్థాలని, అదనపు ద్రవాన్ని తొలగించేందుకు సహాయపడే మూత్రపిండాల పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాల వైఫల్యంకి దారి తీసే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతక పరిస్థితి అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.


ఈ వ్యాధి లక్షణాలు


⦿ రక్తపోటులో హెచ్చుతగ్గులు


⦿ మూత్రంలో ప్రోటీన్లు అధిక స్థాయిలో పెరగడం


⦿ పాదాలు, చీలమండ, చేతులు, కళ్ళలో దీర్ఘకాలిక వాపు


⦿ తరచూ మూత్ర విసర్జన


⦿ ఇన్సులిన్ తగ్గడం


⦿ ఏకాగ్రత లోపం, గందరగోళం


⦿ మైకం, వికారం


⦿ ఊపిరి ఆడకపోవడం


⦿ ఆకలి లేకపోవడం


⦿ బరువు తగ్గడం


⦿ శరీరమంతా దురదగా అనిపించడం


డయాబెటిక్ నెఫ్రోపతి ఎలా వస్తుంది?


అధిక రక్తపోటు డయాబెటిక్ నెఫ్రోపతికి నేరుగా దోహదపడుతుంది. వ్యాధి ముడిరే కొద్ది మూత్రపిండాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇవి తరచుగా రక్తపోటుని పెంచుతాయి. హైపర్ టెన్షన్ కూడా ఇది ఎక్కువ అయ్యేలా చేస్తుంది. మీరు ఇప్పటికే మధుమేహంతో బాధపడుతుంటే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి రాకపోవడం, అధిక రక్తపోటు, ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఇవి కనుక ఉంటే ఈ వ్యాధి బారినపడే ప్రమాదం ఉంది.


ఈ వ్యాధిని ఎలా నివారించాలి?


⦿ షుగర్ లెవల్స్ పర్యవేక్షించుకోవాలి. క్రమం తప్పకుండా రక్తపోటు స్థాయిలు, చక్కెర స్థాయిలు గమించుకోవాలి. ఎంత డైట్ పాటిస్తున్నా నియంత్రణలోకి రాకపోతే వెంటనే వైద్యులని సంప్రదించాలి.


⦿ సొంతంగా ఎప్పుడు వైద్యం చేసుకోకూడదు. డాక్టర్ సలహా సూచనలు మేరకే మందులు తీసుకోవడం చెయ్యాలి.


⦿ బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. ఊబకాయంతో ఉంటే బరువు తగ్గించుకునేందుకు వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శారీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోవాలి.


⦿ ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే విస్మరించాలి. ఇవి మూత్రపిండాలు, ఊపిరితిత్తులని దెబ్బతీస్తాయి. ధూమపానం మానేయడానికి అవసరమైతే వైద్యుని చికిత్స తీసుకోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: కొత్తిమీరతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చా?