AP High Court : ఏపీ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి.రమేశ్‌ బదిలీ సరికాదని న్యాయవాదులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో విధులు బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని ఆరోపించారు. గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి బదిలీని వెనక్కి తీసుకున్నారని డిమాండ్ చేశారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై లాయర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉత్తరాది, దక్షిణాది న్యాయమూర్తుల పట్ల సుప్రీంకోర్టు కొలీజియం వివక్ష చూపుతోందని లాయర్లు విమర్శించారు. విధులు బహిష్కరించాలని ఏపీ బార్ కౌన్సిల్ నిర్ణయించటంతో న్యాయవాదులంతా హైకోర్టు వద్ద ఆందోళన చేశారు.  


ఏడుగురు న్యాయమూర్తులు బదిలీ


దేశంలోని వివిధ హైకోర్టుల నుంచి ఏడుగురు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం సిఫార్సు చేసింది. ఇందులో తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌ హైకోర్టుల నుంచి ఇద్దరి చొప్పున న్యాయమూర్తులున్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్‌ కన్నెగంటి లలితను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్‌ డాక్టర్‌ డి.నాగార్జునను మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ ఏ.అభిషేక్‌రెడ్డిని పట్నా హైకోర్టుకు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను మద్రాస్‌ హైకోర్టుకు, జస్టిస్‌ డి.రమేష్‌ను అలహాబాద్‌ హైకోర్టుకు, మద్రాస్‌ హైకోర్టు నుంచి జస్టిస్‌ వి.ఎం.వేలుమణిని కలకత్తా హైకోర్టుకు, జస్టిస్‌ టి.రాజాను రాజస్థాన్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసింది. 


తెలంగాణ నుంచి ముగ్గురు


తెలంగాణ హైకోర్టుతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టు జడ్జిలను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలిజియం ఆ మేరకు సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత కన్నెగంటి, జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ ను బదిలీ చేశారు. జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయగా,  జస్టిస్ లలిత కన్నెగంటి, జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ ను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు.  ఏపీ హైకోర్టుకు చెందిన జస్టిస్ భట్టు దేవానంద్ ను మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేష్ ను అలహాబాద్ హైకోర్టుకు,  మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వి.ఎం. వెలుమణి కలకత్తా హైకోర్టుకు, టి.రాజాను రాజస్థాన్ హైకోర్టుకు కొలీజియం బదిలీ చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. 


బదిలీలపై తెలంగాణలోనూ ఆందోళన 


తెలంగాణ న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ ఇటీవల హైకోర్టు న్యాయవాదుల ఆందోళన చేపట్టారు.  జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకించారు.  జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ నిరసనలు కొనసాగిస్తామని న్యాయవాదులు తేల్చి చెప్పారు. సిటీ సివిల్ కోర్టులో లాయర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. జస్టిస్ అభిషేక్ రెడ్డి బదిలీని నిలిపివేయాలని లాయర్లు డిమాండ్ చేశారు. అలాగే న్యాయమూర్తుల బదిలీకి తగిన మార్గదర్శకాలను రూపొందించాలని టీహెచ్ సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్ డిమాండ్ చేశారు. పిక్ అండ్ సెలెక్ట్ పద్ధతి న్యాయమూర్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. ఇలా ఆకస్మిక బదిలీలను చేపడితే జడ్జిలు నిర్భయంగా, స్వతంత్రంగా పనిచేయలేరని ఆయన తెలిపారు. కొలీజియం నిర్ణయంపై హైకోర్టు న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారన్నారు.