బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్ కొనసాగుతోంది. ఎప్పుడు బిగ్ బాస్ పదో వారంలో కుటుంబ సభ్యులని ఇంట్లోకి పంపిస్తే ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగా 12వ వారంలో పంపించారు. గత నాలుగు రోజులుగా బిగ్ బాస్ ఇంట్లో అరుపులు, గొడవలు కంటే తమ వాళ్ళని చూసుకున్నాం అనే సంతోషం ఇంటి సభ్యుల్లో కనిపించింది. ఆదిరెడ్డి భార్య, కూతురు మొదటగా ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆదిరెడ్డి కూతురు తొలి పుట్టినరోజుని బిగ్ బాస్ ఇంట్లో చేసి ఫుల్ ఖుషి చేశారు. అది చూసినప్పుడు రేవంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు.


రేవంత్ భార్య ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉంది. ఆమెని చాలా మిస్ అవుతున్నట్టు రేవంత్ పలు సార్లు చెప్పాడు. ఇప్పుడు రేవంత్ వంతు వచ్చేసింది. తన కోసం ఎవరు వస్తారా అని చాలా ఎదురు చూసినందుకు ప్రతిఫలంగా అతని భార్యని బిగ్ బాస్ ఇంట్లోని టీవీలో చూపించారు. భార్య గొంతు వినగానే రేవంత్ పరుగులు పెట్టాడు. టీవీలో ఆమెను చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎలా ఉన్నావ్ నీ హెల్త్ ఎలా ఉందని రేవంత్ తన భార్యతో మాట్లాడతాడు. ఇటువంటి టైమ్ లో నువ్వు లేవనే బాధ ఒక్కటే చాలా ఎక్కువగా ఉందని రేవంత్ భార్య అనేసరికి తను ఏడ్చేశాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా ఆమె మాట్లాడుతుంటే టీవీ ఆపేశాడు బిగ్ బాస్. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీంతో రేవంత్ చిన్నపిల్లోడిలా ఏడుస్తూ ఒక్కసారి భార్యతో మాట్లాడతాను బిగ్ బాస్ అని బతిమలాడటం.. చూసే వాళ్ళని కూడా కంటతడి పెట్టిస్తుంది.


అప్పుడే రేవంత్ తల్లి ఇంట్లోకి వచ్చింది. ఆమెను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు రేవంత్. మగాడు టెన్షన్ పడకూడదు, కోపం తగ్గించు అని మెల్లగా రేవంత్ కి చెప్తుంది. కీర్తిని ప్రేమగా దగ్గరకి తీసుకుంది. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చారు.. కానీ కీర్తికి తల్లిదండ్రులు ఎవరు లేకపోవడంతో చాలా బాధపడింది. ఆమెను దగ్గరకి తీసుకుని చాలా ప్రేమగా మాట్లాడింది. ఇక నుంచి కీర్తి తన కూతురు అని చెప్పింది. ఎప్పుడైనా ఇంటికి రావచ్చని చెప్తుంది. ఇక రేవంత్ తో గడ్డం కొంచెం తీసుకోమని భార్య చెప్పిందని తెలిపింది. మొహం కడుక్కుని వస్తాను అని చెప్పి వెళ్ళి రేవంత్ క్లీన్ షేవ్ చేసుకుని వచ్చేస్తాడు. భార్య కోరిక మేరకి గడ్డం తీసేసి కోర మీసాలు తిప్పుతూ కనిపించాడు రేవంత్.


కాగా ఈ వారం శ్రీహాన్ ఆరు ఓట్లు, ఫైమాకి మూడు ఓట్లు, రోహిత్‌కి మూడు ఓట్లు, రాజ్‌కి రెండు ఓట్లు, ఆదిరెడ్డికి రెండు ఓట్లు, ఇనాయకు రెండు ఓట్లు పడ్డాయి. కీర్తిని ఎవరూ నామినేట్ చేయలేదు. ఇక రేవంత్ కెప్టెన్ అవ్వడంతో ఎవరూ నామినేట్ చేయలేకపోయారు. అంటే రేవంత్, కీర్తి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఈసారి ఇంటి నుంచి ఎవరు వెళతారో అంచనా వేసేస్తున్నారు ప్రేక్షకులు. రాజ్ లేదా రోహిత్.. వీరిద్దరిలో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు భావిస్తున్నారు. 



Also Read: కొడుకుతో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిరి - అందరి దృష్టి ఇనయా, సత్యా పైనే!