Hidden Heart Risk with Normal Cholesterol : గుండె జబ్బులకు ప్రధాన కారణం కొలెస్ట్రాల్. ఇది గుండె ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే హార్ట్ హెల్త్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు.. LDL, HDL, ట్రైగ్లిజరైడ్స్ వంటి కొలెస్ట్రాల్ గణాంకాలపై దృష్టి పెడతారు. కొన్ని సందర్భాల్లో టెస్ట్​లు చేయించుకుని.. ఏవేవి ఎంత లెవెల్స్​లో ఉన్నాయో కూడా చెక్ చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్ కంట్రోల్​ ఉన్నట్లు రిపోర్ట్స్​ వచ్చినా.. గుండె ప్రమాదాలు మాత్రం తప్పవంటున్నారు నిపుణులు. అందుకే కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలంటున్నారు.

కార్డియాలజిస్టుల ప్రకారం..

కొలెస్ట్రాల్​ పట్టించుకున్నంతగా సీరియస్​గా.. కొందరు ఓ విషయాన్ని పట్టించుకోరని.. తరచుగా విస్మరించే ఆ అంశమే గుండె సమస్యలకు కారణమవుతుందని కార్డియాలజిస్టులు  చెప్తున్నారు. అదే లిపోప్రొటీన్ (ఎ) లేదా ఎల్పీ (ఎ) చెక్ చేయించుకోవడం. ఇది కొలెస్ట్రాల్ కణం. దీనిని సాధారణ లిపిడ్ ప్రొఫైల్‌లో చేర్చరు. కానీ ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

భారతదేశంలో వైద్యులు ఆందోళనకరమైన ధోరణిని గమనిస్తున్నట్లు చెప్తున్నారు. ఎందుకంటే 30 నుంచి 40 ఏళ్లు ఉన్న చాలామందిలో కొలెస్ట్రాల్ నివేదికలు నార్మల్​గా ఉన్నా.. వారు గుండెపోటుతో బాధపడుతున్నారనే షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దీని వెనుక అధిక స్థాయి Lp(a) ఒక ముఖ్యమైన కారకంగా ఉండొచ్చనే డౌట్ రైజ్ చేసింది. ఈ అంశం ఎక్కువగా జన్యుపరంగా ప్రభావితమవుతుందట. కాబట్టి ఆహారం లేదా వ్యాయామం దీనిపై పరిమిత ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.

Lp(a) అంటే ఏమిటి? 

Lp(a) నిజానికి LDL కొలెస్ట్రాల్ లాంటి కణం. కానీ దానికి అదనపు ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరంలో భిన్నంగా పనిచేయడానికి బాధ్యత వహిస్తుంది. అధిక మొత్తంలో ఉన్నప్పుడు.. ఇది ధమనులలో ఫలకం ఏర్పడే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రక్త నాళాలలో వాపును పెంచుతుంది. రక్తం గడ్డకట్టే సంభావ్యతను కూడా పెంచి.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

వేగంగా పెరుగుతోన్న సమస్య

భారతదేశంలో ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో అకాల గుండె జబ్బుల సంభవం వేగంగా పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బులకు సంబంధించినవేనని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. చాలా మంది రోగులు పాశ్చాత్య దేశాల కంటే 10 నుంచి 15 సంవత్సరాల ముందుగానే గుండెపోటుకు గురవుతున్నారు. 

గుండె జబ్బులు పెరగడానికి కారణాలు

జన్యు సిద్ధత, మధుమేహం, అధిక రక్తపోటు, నిష్క్రియ జీవనశైలి, Lp(a) వంటి లిపిడ్ ట్రేసస్ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. కొలెస్ట్రాల్ పరీక్షలలో Lp(a) పరీక్షించరు కాబట్టి.. కొలెస్ట్రాల్ మాత్రం సాధారణంగానే ఉందని భావించి నిర్లక్ష్యం చేసి.. చివరికి గుండెపోటు ప్రమాదాల బారిన పడుతున్నారు. 

ఎవరికి ప్రమాదం ఎక్కువ?

వైద్యుల అభిప్రాయం ప్రకారం చిన్న వయస్సులోనే గుండెపోటు లేదా స్ట్రోక్‌ల కుటుంబ చరిత్ర ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ చెకప్స్ చేయించుకోవాలనుకునేవారు.. Lp(a) టెస్ట్ కూడా చేయించుకుంటే ముందుగానే సమస్యను గుర్తించి ప్రమాదం జరగకుండా.. జాగ్రత్తలు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.