మనలో చాలా మందికి తినేటప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. కొంతమందికి వెంటనే ఆగిపోతాయి కానీ మరికొంతమందికి మాత్రం కొన్ని నిమిషాలు పాటు వస్తాయి. అవి వచ్చినప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎక్కిళ్ళు వస్తుంటే ఎవరో తలుచుకుంటున్నారని అంటారు. నిజానికి చికాకు కలిగించే ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయనేందుకు స్పష్టమైన కారణం ఏమి లేదు. కానీ ఒత్తిడి, ఆహారం, మద్యం సేవించడం వల్ల సంభవిస్తాయని అనుకుంటారు. కానీ కొన్ని అరుదైన సందర్భాల్లో ఎక్కిళ్ళు తీవ్రమైన బాడీలీటిక్ క్యాన్సర్ కి సంకేతం కావచ్చని క్యాన్సర్ రీసెర్చ్ వెల్లడించింది.


అమెరికన్ జర్నల్ ఆఫ్ హాస్పైస్ అండ్ పాలీయేటివ్ మెడిసిన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం క్యాన్సర్ తో బాధపడుతున్న రోగుల్లో 40 శాతం మంది ఎక్కిళ్ళు సమస్యని ఎదుర్కొంటున్నట్టు తేలింది. మరొక అధ్యయనంలో ఈ క్యాన్సర్ ఉన్న రోగుల్లో ఎక్కిళ్ళు దాదాపు 48 గంటలకు పైగా వస్తాయి. ఛాతీ, గొంతు లేదా తల క్యాన్సర్ ఉన్న వ్యక్తులకు కూడా ఎక్కిళ్ళు ఎక్కువగా రావచ్చని అట్లాంటిక్ నివేదించింది. క్యాన్సర్ రోగులకు సూచించిన మందులు కీమోథెరపీ, స్టెరాయిడ్స్, ఓపియాయిడ్లతో వీటిని తగ్గించుకోవచ్చు. అతిగా ఎక్కిళ్ళు రావడం వల్ల భోజనం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నారని మరొక అధ్యయనం తెలిపింది. దాదాపు 320 మంది క్యాన్సర్ రోగులపై చేసిన మరొక అధ్యయనం ప్రకారం ఎక్కిళ్ళు 10 మందిలో ఒకరిని ఆస్పత్రి పాలు చేస్తున్నాయి. క్యాన్సర్ రోగుల ఎక్కిళ్ళు వికారం, వాంతుల కంటే భయంకరంగా ఉన్నాయి.


అసలు ఎక్కిళ్ళు అంటే ఏంటి?


క్యాన్సర్ రీసెర్చ్ యూకే ప్రకారం సాధారణ శ్వాసల మధ్య డయాఫ్రాగమ్ లో స్పామ్ వచ్చినప్పుడు ఎక్కిళ్ళు సంభవిస్తాయి. డయాఫ్రాగమ్ అనేది ఊపిరితిత్తుల కింద ఉండే గోపురం ఆకారం కండరం. శ్వాస తీసుకోవడంలో లయబద్ధంగా పనిచేస్తుంది. చాలా సందర్భాల్లో ఎక్కిళ్ళు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే మరికొన్ని సందర్భాల్లో ఛాతిలో కుదుపు అనుభూతి నిమిషాలు లేదా గంటల పాటు కొనసాగుతోంది. ఇవి తీవ్రమైన ఎక్కిళ్ళు. సాధారణంగా 48 గంటల కంటే ఎక్కువగా ఉంటే అవి ప్రమాదకరంగా మారతాయి. నిరంతర ఎక్కిళ్ళు అలసట, నిద్రలేమి వంటి సమస్యలను కలిగిస్తాయి. ఒక్కోసారి మానసిక క్షోభకి కూడా గురవుతారు. 48 గంటల కంటే ఎక్కువ సేపు ఎక్కిళ్ళు వస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


ఎక్కిళ్ళు రావడానికి కారణాలు ఏంటి?


⦿ చాలా త్వరగా తినడం, తాగడం


⦿ గుండెల్లో మంట


⦿ ఒత్తిడి


⦿ గాలి ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు


⦿ మెడ మీద అధిక ఒత్తిడి


⦿ ఆందోళనకి చికిత్స చేసే కొన్ని మందులు(బెంజోడియాజిపైన్స్)


⦿ మద్యం సేవించడం


⦿ క్యాన్సర్ ఉన్న ఎక్కిళ్ళు వస్తాయి


⦿ పొట్ట పని చేయడం ఆగిపోయి ఉబ్బినట్టుగా అనిపిస్తుంది


⦿ ఛాతీ లేదా అన్నవాహిక లో ఇన్ఫెక్షన్


⦿ కీమోథెరపీ, స్టెరాయిడ్స్ లేదా మార్ఫిన్ వంటి ఓపియాయిడ్ పెయిన్ కిల్లర్ వాడటం


⦿ క్యాన్సర్ డయాఫ్రాగమ్ పై ఒత్తిడి వల్ల


మందుల వల్ల ప్రమాదమే..


కొన్ని మందులు కూడా ఎక్కిళ్ళు వచ్చేందుకు దోహదపడతాయి. స్టెరాయిడ్స్, ట్రాంక్విల్లిజర్స్, ఓపియేట్స్ (మార్ఫిన్ వంటివి) మిథైల్డోపా కలిగి ఉన్న పెయిన్‌కిల్లర్స్ వాడటం వల్ల వస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్, పిత్తాశయం ఇన్ఫెక్షన్, గత సమస్యలు, మెడ, ఛాతీ లేదా పొట్టని ప్రభావితం చేసే పరిస్థితులు, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా వస్తాయి. కొన్ని గుండె పరిస్థితులు, గుండె పోటు, గుండెల్లో మంట వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్ళు సంభవిస్తాయి. స్ట్రోక్, తల గాయం, మెదడు ఇన్ఫెక్షన్ వంటి పరిస్థితుల్లోని ఎక్కిళ్ళు అధికంగా వచ్చి ఇబ్బంది పెడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.