Health Benefits with Hibiscus : మందారను కొన్ని శతాబ్ధాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. హెయిర్ కేర్ కోసం చాలామంది మందార పువ్వులు, ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కేవలం బ్యూటీకే కాదు ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు అందిస్తుంది అంటున్నారు నిపుణులు. దీనిలోని ఆంథోసైనిన్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక సమస్యలను దూరం చేస్తాయి అంటున్నారు. ఇంతకీ ఈ మందార టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


బరువుతో పాటు.. ఆ సమస్యలు కూడా దూరం


ప్రతిరోజూ మందార టీ తాగడం వల్ల సహజంగా బరువు తగ్గొచ్చు. దీనిలోని ఫ్లేవనాయిడ్లు కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తాయి. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. బరువు తగ్గడంలో మందార బాగా హెల్ప్ చేస్తుందని పలు అధ్యయనాలు కూడా నిరూపించాయి. ఇది ఊబకాయం వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్​తో ఇబ్బంది పడేవారు దీనిని రెగ్యూలర్​గా తీసుకోవచ్చు అంటున్నారు. అయితే మందార టీ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా మీ మొత్తం ఆరోగ్యానికి, అవయవాలకు కూడా మంచిదట. 


దీర్ఘకాలిక సమస్యలను దూరం చేసుకోవచ్చు..


మందార టీ జీర్ణ సమస్యలను తొలగించి.. పేగు ఆరోగ్యాన్ని, జీవక్రియను మెరుగుపరుస్తుంది. మెరుగైన జీవక్రియ కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ ​నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయం చేస్తాయి. కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల శరీరంలో మంట ఏర్పడుతుంది. మీకు అలాంటి సమస్య ఉంటే మందార టీ మీకు ఉపశమనం ఇస్తుంది. ఆర్థరైటిస్, అల్జీమర్స్ వ్యాధుల బారిన పడుకుండా కాపాడుతుంది. 


కొలెస్ట్రాల్ సమస్యలుంటే..


అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఈ హెర్బల్ టీ అధ్బుతమైన ఔషధమని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులను నివారిచండంలో హెల్ప్ అవుతాయి. కాలేయ సమస్యలున్నవారు కూడా దీనిని తీసుకోవచ్చు. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మహిళలు యూటీఐ ఇన్​ఫెక్షన్​ రాకుండా కూడా దీనిని తీసుకోవచ్చు. 


మందార టీని ఇలా తయారు చేసుకోండి..


మందార పువ్వులను ఎండబెట్టి వాటిని గ్రీన్​ టీ, బ్లాక్​ టీ లెక్క నేరుగా ఉపయోగించుకోవచ్చు. ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై ఓ గిన్నె పెట్టి నీరు పోయండి. ఇప్పుడు దానిలో మందార ఆకులు వేసి మరగనివ్వండి. అనంతరం స్టౌవ్ ఆపేసి.. 2 నిమిషాలు మూతపెట్టండి. ఇప్పుడు దానిని వడకట్టి తాగవచ్చు. మందార పువ్వులు అందుబాటులో లేకుంటే.. మందార పొడిని మీరు టీ కోసం ఉపయోగించవచ్చు. దీనిని మీరు ఇదే ప్రాసెస్​లో తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హెల్తీ హెర్బల్​ టీని మీ డైట్​లో చేర్చేసుకోండి.  


Also Read : జనాలు డిప్రెషన్​తోనే నిద్ర లేస్తున్నారట.. కారణాలు చెప్తున్న కొత్త అధ్యయనం







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.