మధుమేహం వచ్చాక జీవితం అంత సులభం కాదు. తినే ఆహారా పదార్థాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. జీవన శైలిని మార్చుకోవాలి. అధిక సమయం పాటూ ఒకే చోట కూర్చోవడం, నిద్రపోవడం వంటివి చేయకూడదు. వ్యాయామం చేస్తూ చురుగ్గా ఉండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీన్ని పూర్తిగా నయం చేసే చికిత్స ఇప్పటివరకు లేదు. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేనప్పుడు, లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకోనప్పుడు మధుమేహం వస్తుంది. ఇన్సులిన్ అనేది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోను. మధుమేహం ఉన్నవారు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలకు ఎంచుకోవాలి. ఇది నీటిలో కరిగిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఇది అవసరం.
ఫైబర్ అనేది ఒక రకమైన కార్బోహైడ్రేట్.ఫైబర్ ఆహారం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడానికి, జీర్ణక్రియ నెమ్మదిగా సాగేందుకు సహాయపడుతుంది. ఇది శరీరంలో ఆకస్మికంగా గ్లూకోజ్ పెరగడాన్ని అడ్డుకుంటుంది. ఇన్సులిన్ విడుదలను నియంత్రిస్తుంది. అందుకే ఫైబర్, డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. కింద ఇచ్చిన ఆహార పదార్థాల్లో ఫైబర్, డైటరీ ఫైబర్... రెండూ అధికంగా ఉంటాయి.
ఓట్స్
ఓట్స్‌లో కరగని, కరిగే ఫైబర్... రెండూ ఉంటాయి. కరిగేది ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మన శరీరాలు కరిగే ఫైబర్‌ను విచ్ఛిన్నం చేయలేవు కాబట్టి, రక్తం శోషించుకోదు. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. ఇది పొట్టలోని మంచి బాక్టీరియాకు సహాయపడే ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.
బార్లీ
బార్లీలో ఎక్కువగా కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరగదు. కొంచెం తిన్నా కూడా పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉండేలా చేస్తుంది.
కొమ్ము శెనగలు
ప్రతి ఇంట్లో కొమ్ము శెనగలు ఉంటాయి. వీటిని నానబెట్టి లేదా ఉడకబెట్టి వండుకోవాలి. చిక్‌పీస్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రాఫినోస్ అని పిలిచే కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
యాపిల్
రోజుకు ఒక యాపిల్ తింటే చాలు వైద్యునికి దూరంగా ఉండొచ్చు అని అంటారు. అది నిజమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యాపిల్ తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గిపోతుంది. యాపిల్స్ లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చక్కెర శోషణను నెమ్మదించేలా చేస్తుంది.
సబ్జా విత్తనాలు
సబ్జా గింజల్లో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీవక్రియను నెమ్మదించేలా చేస్తుంది. పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మార్చడాన్ని నియంత్రిస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి సహాయపడే సూపర్‌ఫుడ్ అని చెప్పుకోవచ్చు.
Also read: విపరీతమైన వేడి గుండె వైఫల్యానికి దారితీస్తుంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.