కరోనా ముగిసిపోయి... అందరూ ఆఫీసు బాట పట్టారు. మళ్లీ సహోద్యోగులతో కలిసిమెలిసి పని చేయాల్సిన పరిస్థితి. మీ చుట్టూ ఉన్న సహోద్యోగులతో మీరు గౌరవంగా, స్నేహంగా ఉండడం ఎంత ముఖ్యమో, వారు కూడా మిమ్మల్ని గౌరవించేలా చేసుకోవడం, స్నేహంగా ఉండేలా చేసుకోవడం అంతే ముఖ్యం. పనిచేసే చోట అనుబంధాలు సరిగా లేకపోతే, ఆ ప్రభావం పనిపై కూడా ఉంటుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండే వాళ్ళు అధిక ప్రొడక్టివిటీతో ఉంటారని ఎన్నో సర్వేలు, అధ్యయనాలు కూడా చెప్పాయి. కాబట్టి మీ సహోద్యో గులను మీతో స్నేహంగా ఉండేలా చేయడానికి చిన్న చిట్కాలు ఉన్నాయి.
స్మాల్ బ్రేక్
కాసేపు పనిచేశాక మధ్యలో స్మాల్ బ్రేక్ తీసుకోవాలి. ఆ బ్రేక్ లో మీ సహోద్యోగులతో కలిసి కాఫీ తాగడం, కాసేపు ఛిల్ అవ్వడం చేస్తే స్నేహం రెట్టింపు అవుతుంది. ఇలా ప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు వారితో కాఫీ టైం గడపడం వల్ల మీ మధ్య బంధం బలపడుతుంది.
చిరునవ్వుతో..
ఆఫీసులోకి వస్తూనే ముఖాన్ని సీరియస్ గా పెట్టకుండా, చిరునవ్వుతో అందరినీ పలకరించాలి. చిరునవ్వు అనేది ఒక సంతోషకరమైన భావోద్వేగం.ఆ భావోద్వేగం ఎదుటివారికి మిమ్మల్ని దగ్గర చేస్తుంది.ఉదయాన్నే ఆఫీస్‌కి వస్తూ మీ సహోద్యోగులకు గుడ్ మార్నింగ్‌తో పాటు, చిరునవ్వును కూడా విసరండి.
చెప్పింది వినండి
ఎవరైనా తాము చెప్పేది ఓపిగ్గా వినే వారికి దగ్గరవుతారు. అలాగే మీరు కూడా మీ సహోద్యోగులు ఏదైనా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. వారి మాటలకు మధ్యలో అడ్డుతగలడం, మధ్యలోనే ఆపేయడం లేచి వెళ్లిపోవడం, వారిని మాట్లాడినవ్వకుండా ఎక్కువ సేపు మీరే మాట్లాడడం... ఇవన్నీ మీపై చికాకును కలిగిస్తాయి. కాబట్టి ఓపిగ్గా వినడం కూడా స్నేహాన్ని పెంచుతుంది. అలాగే మీ విలువను కూడా పెంచుతుంది.
బోరింగ్ అనిపించుకోవద్దు
బోరింగ్ వ్యక్తులతో ఎవరు స్నేహం చేయరు. కాబట్టి మిమ్మల్ని మీరు బోరింగ్ వ్యక్తిగా ప్రపంచానికి చూపించుకోకండి. మీ సహోద్యోగి మీతో మాట్లాడుతున్నప్పుడు మూగవారిలా ఉండడం, అతను ఏదైనా చెప్పినప్పుడు జస్ట్ తల ఊపి ఊరుకోవడం, దానికి రిప్లై ఇవ్వకపోవడం... ఇవన్నీ మీకు బోరింగ్ వ్యక్తిగా గుర్తింపునిస్తాయి. కాబట్టి వారు ఏదైనా చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినడమే కాదు, అవుననో కాదనో రిప్లై ఇవ్వాలి. వారు కాఫీకి పిలిచినప్పుడు రాను అనకుండా ఓ ఐదు నిమిషాలు వెళ్లి రావాలి.
వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు
అయితే సహోద్యోగులతో స్నేహం కోసం నటించమని మేము చెప్పడం లేదు. మీ వ్యక్తిత్వాన్ని మీరు కొనసాగిస్తూనే కాస్త మారితే చాలు, మధ్యలో ఛిల్ అవడం అనేది మీకు కూడా అవసరం మీ మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాసేపు పని ఒత్తిడి కూడా తగ్గుతుంది. రెండు మూడు గంటలకు ఓసారి ఓ 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే. ఆరోగ్యానికి కూడా మంచిదే.
Also read: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.