మనిషి మనుగడకు ఉపయోగపడే మందులను, అంశాలను కనిపెట్టేందుకు నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి పరిశోధనల్లో ఇప్పుడు కొత్తగా ఒక విషయం బయటపడింది. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల గుండెపోటు వంటి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతోందని ఒక తాజా అధ్యయనం చెప్పింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక వైద్య పరిశోధనా సంస్థ అయిదేళ్లుగా విటమిన్ డి సప్లిమెంట్లపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్న వృద్ధులలో గుండెపోటు లేదా హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉందో అది అంచనా వేసింది. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 60 ఏళ్ల నుండి 84 ఏళ్ల మధ్య వయసుగల వృద్ధులను ఎంచుకున్నారు. ఐదేళ్లపాటు వారి ఆరోగ్య డేటాను పరిశీలించారు. దీనిలో 21 వేల మంది వృద్ధులు పాల్గొన్నారు. ఈ ఐదేళ్లలో విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్న వృద్ధులతో పోలిస్తే, విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకోని వృద్ధులలో గుండె జబ్బుల ప్రమాదం అధికంగా ఉన్నట్టు తేలింది. విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్న వృద్ధులలో గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గినట్టు పరిశోధకులు కనిపెట్టారు.


ప్రపంచవ్యాప్తంగా హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. 50 ఏళ్లు దాటుతున్న కొద్దీ దీర్ఘకాలిక వ్యాధులు దాడి చేయడం ఎక్కువ అవుతుంది. అలాగే హృదయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా కోటి 79 లక్షల మంది కేవలం హృదయ సంబంధ వ్యాధుల కారణంగానే ప్రాణాలను కోల్పోతున్నారు. గుండెపోటు, కార్డియాక అరెస్ట్, కరోనరీ హార్ట్ డిసీజ్, రుమాంటిక్ హార్ట్ డిసీజ్ వంటివి హృదయ సంబంధ వ్యాధుల జాబితాలోకే వస్తాయి. కోవిడ్ అనంతరం యువకులు కూడా గుండెపోటు సమస్యలతో మరణించడం కలవరపెడుతోంది. అయితే ఈ తాజా అధ్యయనంలో విటమిన్ డి సప్లిమెంట్లు గుండెకు రక్షణను కల్పిస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని కనుగొనడం కాస్త ఆశాజనకమైన విషయం.


విటమిన్ డి అనేది మన శరీరానికి అత్యవసరమైన పోషకం ఇది. సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి అందుతుంది. ఇది కొవ్వులో కరిగిపోతుంది. మన శరీరం కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పేట్ వంటివి శోషించుకోవడానికి విటమిన్ డి చాలా అవసరం. కణాల పెరుగుదలకు రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు, గ్లూకోజ్ జీవక్రియకు, నాడీ కండరాలు ఆరోగ్యంగా ఎదగడానికి, జీవకణాలు పెరగడానికి విటమిన్ డి అవసరం. అలాగే ఇప్పుడు గుండె ఆరోగ్యానికి కూడా విటమిన్ డి చాలా అవసరం అని తేలింది.


అయితే విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల నేరుగా గుండె జబ్బులు పూర్తిగా తగ్గిపోతాయని ఈ అధ్యయనం చెప్పడం లేదు. కానీ గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని ఎంతో కొంత విటమిన్ డి సప్లిమెంట్లు తగ్గిస్తాయని మాత్రం చెబుతోంది. రోజూ వ్యాయామం చేయడం, పోషకాహారాన్ని తినడం, విటమిన్ డి ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవడం చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. ఒత్తిడి, యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటివి పెరిగిపోతాయి. ఇవి కూడా గుండెకు ఎంతో హాని చేస్తాయి. 


Also read: డయాబెటిక్ రోగులు వానాకాలంలో మీ పాదాలను ఇలా కాపాడుకోండి


Also read: చాక్లెట్ అతిగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్టులు రాక తప్పవు


























































































































































































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.