డయాబెటిక్ రోగులు ఆహారం విషయంలోనే కాదు, మరెన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పాదాలను కాపాడుకోవాలి. డయాబెటిక్ ఉన్న వారిలో పాదాల సమస్యలు త్వరగా వస్తాయి. డయాబెటిక్ ఫుట్ కేర్ అనేది వర్షాకాలంలో చాలా ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు తడిగా ఉండే ప్రదేశాలలో తిరగడం వల్ల, తేమతో కూడిన వాతావరణంలో ఉండడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల పాదాల్లోని నరాలు దెబ్బతింటాయి. పాదాలకు ఏదైనా దెబ్బలు తాకినా అవి త్వరగా నయంకాక ఇన్ఫెక్షన్ల బారిన పడి పాదాలు తొలగించుకునే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే డయాబెటిక్ రోగులు కచ్చితంగా పాదాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వానాకాలంలో వారు తడి ప్రదేశాలలో తిరగకూడదు.
డయాబెటిక్ రోగులు పాదాలను కాపాడుకునేందుకు వాటికి రక్షణగా బూట్లను ఉపయోగించాలి. అలాగే సరిగ్గా సరిపోయే బూట్లనే ధరించాలి. ముఖ్యంగా బొటనవేలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బొటనవేలుకే ఎక్కువగా బూట్లలో ఇరుక్కుని గాయాలు అవుతాయి. అవి త్వరగా తగ్గకుండా ఇన్ఫెక్షన్ బారిన పడి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
పాదాలపై గాయాలు, దెబ్బలు వంటివి రాకుండా జాగ్రత్త పడండి. పాదాలకు నొప్పి లేదా గాయం తగిలినా వెంటనే వైద్యులను సంప్రదించండి. పాదాలు ఎప్పుడూ కూడా పొడిగా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. తేమ లేకుండా జాగ్రత్త పడండి. మీ పాదాలను గోరువెచ్చటి నీటితో కడిగి వెంటనే తడిని తుడిచేసి మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తూ ఉండండి.
వానాకాలంలో చెప్పులు లేకుండా నడవడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే నేలతడిగా ఉంటే పాదాలపై ఆ ప్రభావం పడుతుంది ముఖ్యంగా ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా పాదాలకు చేరుతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్లు మొదలవొచ్చు
పాదాలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం చాలా ముఖ్యం. డయాబెటిక్ రోగులు రోజూ పాదాలలో రక్తప్రసరణను పెంచేందుకు వ్యాయామాలు చేయాలి. పాదాలలో రక్తప్రసరణ పెరిగితే ఇన్ఫెక్షన్, పుండ్లు వంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి నడక, సైక్లింగ్ వంటివి చేస్తూ ఉండాలి.
పాదాలలో తిమ్మిరి పెట్టడం, జలదిరింపు వంటివి రావడం ఎక్కువ కాకుండా చూసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమైతే పాదాలకు తిమ్మిరి పట్టడం, జలదరింపులు రావడం జరుగుతాయి. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా జాగ్రత్త పడండి. మధుమేహం ఉన్న రోగులలో 15 నుంచి 25 శాతం మంది ఇలా డయాబెటిక్ ఫుట్ అల్సర్ బారిన పడుతున్నారు. భారతదేశంలో ప్రతి ఏడాది లక్ష మంది డయాబెటిక్ రోగుల పాదాలను తొలగిస్తున్నట్టు అంచనా. అందుకే మధుమేహ రోగులు పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.