Heart Attack Warning Signs : ఈ మధ్యకాలంలో హార్ట్ ఎటాక్​ కేసులు చాలా ఎక్కువగా వింటున్నాము. కొందరు గుండెపోటుతో ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు. ఆరోగ్యంగా, ఫిట్​గా ఉండేవారు కూడా ఈ హార్ట్ ఎటాక్​కి గురి అవుతున్నారు. అయితే హార్ట్ ఎటాక్స్ సడెన్​గా రావని.. అవి వచ్చే కొన్ని వారాల ముందు లేదా నెలల ముందు నుంచే శరీరానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తాయని అంటున్నారు నిపుణులు. 

శరీరంలో అనుకోకుండా వచ్చే కొన్ని మార్పులు సాధారణమైనవి కావని.. ఆరోగ్య సమస్యలకు సంకేతాలని చెప్తున్నారు. అలాగే గుండెపోటు వచ్చే ముందు కూడా శరీరం కొన్ని ప్రమాద హెచ్చరికలు ఇస్తుందని చెప్తున్నారు కార్డియాలజిస్ట్​లు. ఆ సంకేతాలను విస్మరిస్తే గుండెపోటు ప్రమాదం మరింత రెట్టింపు అవుతుందని చెప్తున్నారు. అందుకే వాటిని గుర్తించి వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకుంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని చెప్తున్నారు. 

కార్డియాలజిస్ట్ డాక్టర్ ఫిన్నీ కూడా ఈ విషయంపై అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ''హార్ట్ ఎటాక్ వచ్చే ముందు వాళ్ల బాడీ కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. కొన్నివారాల ముందు, నెల ముందే వాళ్ల శరీరం ఆ సంకేతాలు ఇస్తుంది. కాకపోతే వీటిని అందరూ గుండెపోటు సంకేతాలని గుర్తించరు కాబట్టి వాటిని ఇగ్నోర్ చేస్తారంటూ'' కొన్ని ప్రమాద గురించి వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

ప్రమాద హెచ్చరికలు ఇవే.. 

నీరసం.. ఏ పని చేయకపోయిన నీరస పడిపోవడం గుండెపోటులో భాగమేనట. ముందువరకు బాగానే పని చేసేవారు కూడా చిన్న పని చేసినా నీరసంగా ఫీల్ అవుతారట. వారి పనులు వారు చేసుకోలేని ఇబ్బంది కనిపిస్తుందట. బాగా నీరసంగా, త్వరగా అలసిపోయినా.. వైద్య సహాయం తీసుకుంటే మంచిదని తెలిపారు. ముఖ్యంగా ఆడవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందట. 

ఆయాసం.. 

కొద్ది దూరం నడిచినా.. మెట్లు ఎక్కినా ఆయాసంగా అనిపిస్తుంది కామనే. కానీ ముందు ఉన్న దానికంటే ఎక్కువగా ఆయాస పడుతున్నారా? అయితే ఇది కూడా గుండెపోటులో భాగం కావొచ్చని చెప్తున్నారు ఫిన్నే. రోజూ చేసే పనులు చేసేప్పుడు ఆయాసంగా అనిపిస్తుంటే కచ్చితంగా వైద్యసహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. 

చెమట

సడెన్​గా శరీరం అంతా చల్లబడిపోయి.. చెమటలు పట్టేస్తున్నాయా? ఇది కూడా హార్ట్ ఎటాక్​ ముందు శరీరం ఇచ్చే సంకేతాల్లో భాగమేనట. చేతులు కూడా చాలా చల్లగా అయిపోతాయట. ఇది అత్యంత ప్రమాదహెచ్చరికగా చెప్తున్నారు. గుండెలోని రక్తం సరిగ్గా పంప్ కానీ నేపథ్యంలో ఇలా జరుగుతుందట. 

తల తిరగడం.. 

అప్పటివరకు బాగానే ఉన్నవ్యక్తికి సడెన్​గా తల తిరిగినట్లు అనిపిస్తుందట. ఈ సంకేతం కూడా గుండెపోటులో భాగమే. కళ్లు తిరగడమంటే పడిపోవడం కాదు.. మగతగా అనిపించడం.. సడెన్గా తల తిరగడం వంటివి జరుగుతాయట. ఆ సమయంలో వాంతులు అవుతున్నట్లు అనిపించడం వల్ల ఇది వేరే సమస్య అనుకుని విస్మరిస్తారని తెలిపారు.

ఇవే కాకుండా గుండె దడగా అనిపించడం, హార్ట్ రేట్ ఎక్కువ అయిపోవడం కూడా హార్ట్ ఎటాక్​లో భాగమేనని తెలిపారు. అలాగే గుండె దగ్గర నొప్పి మాత్రమే కాకుండా దవడ నొప్పి, వీపు దగ్గర, భుజం దగ్గర నొప్పి రావడం కూడా హార్ట్ ఎటాక్​ వచ్చే ముందు హెచ్చరికేనని తెలిపారు. 

ఇలాంటి సంకేతాలు గుర్తించినప్పుడు వైద్యసహాయం కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆ సమయంలో ఈసీజీ, 2డి ఎకో టెస్ట్​లు చేయించుకుంటే మంచిదని.. వాటివల్ల గుండె సమస్యలు ఏమైనా ఉంటే తెలుస్తాయని తెలిపారు. ఇలా చేయడం వల్ల 90 శాతం హార్ట్ ఎటాక్స్​ను అడ్డుకోవచ్చని చెప్తున్నారు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.