స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేసిన తమిళ దర్శకులలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) ఒకరు. తమిళంలో తీసిన 'ఘర్షణ' సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేశారు. అయితే... 'ఏ మాయ చేసావె'ను తెలుగు, తమిళ భాషలలో వేరువేరు హీరోలతో షూట్ చేశారు. ఆ కథను తెలుగు హీరో కోసమే రాశానని తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు తెలిపారు.
మహేష్ బాబు కోసం రాసిన కథ!'ఏ మాయ చేసావె'లో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించారు. 'జోష్' సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన నాగ చైతన్యకు అది అంత మంచి విజయం అందించలేదు. ఆ తర్వాత గౌతమ్ మీనన్ తీసిన సినిమాతో హిట్ అందుకున్నారు. అయితే ఈ కథను నాగచైతన్య కోసం రాయలేదని, సూపర్ స్టార్ మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని రాశానని తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెప్పారు.
చిరు సినిమాకు హీరో అసిస్టెంట్!'ఏ మాయ చేసావె' కథ గుర్తు ఉందా? అందులో అసిస్టెంట్ డైరెక్టర్‌గా హీరో కనిపిస్తాడు. పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో నాగ చైతన్య పని చేసినట్లు చూపించారు. మహేష్ బాబు కోసం కథ రెడీ చేసినప్పుడు... హీరో క్యారెక్టర్ కాస్త డిఫరెంట్‌గా రాశారు గౌతమ్ వాసుదేవ్ మీనన్.
''ఏ మాయ చేసావె' సినిమాను తెలుగులో ఒక సూపర్ స్టార్‌తో చేయాల్సి ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ప్రొడక్షన్ హౌస్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసింది'' అని గౌతమ్ మీనన్ అని చెప్పారు. ఆయన మహేష్ బాబు పేరు ఎక్కడ తీయలేదు. కానీ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసింది సూపర్ స్టార్ ఫ్యామిలీ అని చెప్పడంతో మహేష్ కోసం కథ రాశారని అర్థం అయింది.
''నేను రాసిన ఫస్ట్ డ్రాఫ్ట్ కథ కథలో కాస్త సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ కథలో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు హీరో పని చేస్తాడు. ఆ అబ్బాయితో స్టార్ హీరోకి మంచి రిలేషన్ ఉంటుంది. అబ్బాయి డిస్టబ్డ్‌గా ఉండడంతో చిరంజీవి గారు అడిగితే... తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరుగుతుందని చెబుతాడు. అప్పుడు హెలికాఫ్టర్ వేసుకుని అక్కడికి వెళతారు. అలా కథ రాసుకున్నాను. కానీ సూపర్ స్టార్ ఒక యాక్షన్ కథ కావాలని అడిగారు. అప్పుడు కొత్త వాళ్లతో సినిమా చేశా'' అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెప్పారు.
Also Read: 'తమ్ముడు'కు ముందు... పవన్ కళ్యాణ్ టైటిల్స్ వాడిన హీరోలు ఎవరు? ఆ సినిమాలు ఏమిటి?
దగ్గర దగ్గరగా బ్రూస్ లీ క్లైమాక్స్!చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన 'బ్రూస్ లీ' గుర్తు ఉందా? ఆ సినిమాలో క్లైమాక్స్ గుర్తు ఉందా? ఇప్పుడు గౌతమ్ మీనన్ చెప్పిన కథకు కాస్త దగ్గర దగ్గరగా ఉంటుంది. 'ఏ మాయ చేసావె' సినిమాలో హీరో అసిస్టెంట్ డైరెక్టర్ అయితే 'బ్రూస్ లీ' సినిమాలో హీరోలకు బదులు యాక్షన్ సీక్వెన్స్ చేసే డూప్ క్యారెక్టర్ చేశారు రామ్ చరణ్. అతను చిరంజీవి సినిమాకు పని చేస్తూ ఉంటాడు. క్లైమాక్స్ వచ్చేసరికి తాను ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో ఉంటే ఆ విషయం చిరంజీవికి చెబుతాడు. హెలికాప్టర్ వేసుకుని చిరు వెళతారు. అది సంగతి.