ముఖానికి మసాజ్ ఎంతో మేలు
రోజంతా పని చేసి అలిసిపోయినప్పుడు ఒళ్లంతా మసాజ్ చేసుకుంటే ఎంత రిలీఫ్‌గా ఉంటుందో... ముఖానికి కూడా మసాజ్ చేస్తే అంతే అందంగా ఉంటుంది. వలయాకారంలో, పై నుంచి కిందకు మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా చర్మం యవ్వనంగా మారి.... వయస్సుతో పాటు ఏర్పడే ముడతలు తగ్గిపోతాయి. మసాజ్‌ చేయడం అంటే ముఖం మీది మలినాలు తొలగించడమే. స్క్రబ్బింగ్‌ చేసేటప్పుడు నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. దాంతో మృతకణాలు, మురికి, నల్లమచ్చల నుంచి ఉపశమనం కలుగుతోంది.


ఫేస్‌ప్యాక్‌ ఏదైనా ఫరవాలేదు, సరిపోతుంది అనుకుంటే పొరపాటే. మీది ఎలాంటి చర్మమో తెలుసుకుని దానికి నప్పే ప్యాక్‌ను ఉపయోగించినప్పుడే ఫలితం ఉంటుంది.


సాధారణచర్మం అయితే ఆపిల్‌ ప్యాక్‌ వాడొచ్చు. ఆపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తరువాత గుజ్జు మాదిరిగా చేసుకోవాలి. దీనికి తేనె కలిపి 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిదానంగా మసాజ్‌ చేస్తున్నట్టుగా ముఖంపై అప్లై చేయాలి. అరగంట తరువాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆపిల్‌లో విటమిన్‌ ఎ, బి, సి ఉంటాయి. ఫెనాల్స్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ లభిస్తుంది. ఇవన్నీ సాధారణ చర్మానికి నిగారింపు వచ్చేలా చేస్తాయి. 


మొటిమల సమస్య


సాధారణంగా మొటిమల సమస్యతో టీనేజర్లు ఎక్కవగా బాధపడుతుంటారు. సాధారణ చర్మం వారికి  అన్ని రకాల ప్యాక్స్‌ పడవు. తేనె కాంబినేషన్స్‌తో కూడిన ప్యాక్స్‌ మాత్రమే సరిపోతాయి. అలాగే,  సబ్బుతో కాకుండా మైల్డ్‌ ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవాలి. 


పొడిచర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్‌ ఉన్న క్రీమ్స్‌, ప్యాక్స్‌ వేసుకోవడం మంచిది. పాలతో మిక్స్‌ చేసే ప్యాక్స్‌ వేసుకోవచ్చు. అలాగే ముల్తానీ మట్టి, శనగపిండి అప్పుడప్పుడు వాడొచ్చు. అలాగే నిమ్మ, ఆరెంజ్‌లాంటివి వాడొద్దు. వీటిని వాడితే చర్మం మరింతగా పొడిబారి పోతుంది. కలబంద వాడితే మంచి ఫలితం ఉంటుంది. 


మొటిమలు బాధిస్తున్నట్లయితే ఆరెంజ్‌ ప్యాక్‌ వాడాలి. ఒక ఆరెంజ్‌, ఒక టీస్పూన్‌ పుదీనా, కొంచెం లెమన్‌ జ్యూస్‌ కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఆరెంజ్‌లో విటమిన్‌ ‘సి’ పుష్కలం,. యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌ మొటిమలను నిరోధించడంలో తోడ్పడతాయి.


జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రకం చర్మం ఉన్నవారు సిట్రస్‌ ఫేస్‌ వాష్‌, ప్యాక్స్‌ ఎక్కువ వాడాలి. అయినప్పటికీ ఏ చర్మం వారికైనా మొటిమల సమస్యల నుంచి విముక్తి కలగకపోతే వైద్యులను సంప్రదించాల్సిందే.  


చర్మం డల్‌గా ఉంటే... స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్
చర్మం డల్‌గా ఉంటే స్ట్రాబెర్రీలను ఉపయోగించి ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. అరకప్పు స్ట్రాబెర్రీల గుజ్జు, పావు కప్పు కార్న్‌స్టార్చ్‌ను పేస్ట్‌ మాదిరిగా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలసిపోయినట్లుగా ఉన్న చర్మానికి, డల్‌స్కిన్‌కు ఇది బాగా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీలో సాలిక్లిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.