Spending Too Much Time in AC : ఎండకాలం వచ్చేసింది. వేడిని తట్టుకోవడానికి ఎయిర్ కండిషనర్ల (ACల) వాడకం అనేది సర్వసాధారణమైపోయింది. ఇళ్ల నుంచి ఆఫీసుల వరకు, మాల్స్ నుంచి వాహనాల వరకు.. ప్రతిచోటా ACలను ఉపయోగిస్తున్నారు. వేడి నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ సమయం ఏసీలో గడుపుతున్నట్లయితే.. మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయట. ఇది మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుందని చెప్తున్నారు. 'సిక్ బిల్డింగ్ సిండ్రోమ్' వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.
ఆరోగ్యంపై ఏసీ ప్రభావం..
ఏసీలోని చల్లని గాలి ఉపశమనం కలిగించినప్పటికీ.. అది అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. అందుకే కొందరికి ఏసీ గదిలో ఉన్నందుకు తరచుగా తలనొప్పి, గొంతునొప్పి, జలుబు, పొడి చర్మం వంటి ఇబ్బందులు వస్తాయి. నిరంతరం పొడి, చల్లని గాలికి గురికావడం వల్ల మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీనివల్ల ఆయాసం, సైనస్ సమస్యలు, తల బరువుగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఎక్కువసేపు ఏసీకి గురైతే.. తల బరువుగా అనిపించడం లేదా తలనొప్పి రావడం సర్వసాధారణంగా మారుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏసీ వల్ల తల బరువుగా ఎందుకవుతుందంటే..
ఏసీలు గదిలోని తేమను పీల్చుకుని.. గాలిని చాలా పొడిగా చేస్తాయి. ఈ పొడి గాలి శరీరం నుంచి తేమను లాగేస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్ జరిగి తలనొప్పులు వస్తాయి. అలాగే శరీరం చాలా చల్లని గాలికి గురైనప్పుడు.. తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనినే వాసోకాన్‌స్ట్రిక్షన్ అని కూడా అంటారు. ఈ సంకోచ ప్రక్రియ తల, మెదడులో ఒత్తిడిని పెంచి.. తలనొప్పికి కారణమవుతాయి.
చల్లని, పొడి గాలి ముక్కు, గొంతులోని శ్లేష్మ పొరలను పొడిబారేలా చేస్తుంది. దీనివల్ల సైనస్‌లలో వాపు లేదా రద్దీ ఏర్పడవచ్చు. ఇది తలనొప్పికి కూడా దారితీయవచ్చు. తక్కువ ఉష్ణోగ్రత, మూసి ఉన్న గదిలో ఉండటం వల్ల కండరాల బిగుతుగా మారి.. అలసటగా ఉంటుంది. దీనివల్ల తల బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది.
నివారణ చర్యలు
ఈ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే.. ఏసీ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా పెట్టకూడదని చెప్తున్నారు. సుమారు 24-26°C వద్ద ఉంచాలని సూచిస్తున్నారు. ఏసీలో ఉన్నప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఏసీలో కూర్చోవడం మానుకోవాలని.. మధ్యలో బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఏసీ ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం కూడా ముఖ్యం.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
