Headaches: తలనొప్పి అనేది అనేక కారణాలవల్ల వస్తూ ఉంటుంది. దీనికి నిర్దిష్టమైన కారణం అంటూ ఏది ఉండదు. అలాగని తలనొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కొన్ని తలనొప్పులు ప్రమాదకరమైన జబ్బులకు సంకేతం కావచ్చు. తలనొప్పిపై ఇటీవల అమెరికా వైద్య నిపుణులు జరిపిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి.
అమెరికాలో దాదాపు 11.2 కోట్ల మంది తలనొప్పి కారణంగా అనారోగ్యం పాలవుతున్నారని గుర్తించారు. దీనికి సంబంధించి ‘జర్నల్ ఆఫ్ హెడేక్ అండ్ పెయిన్’ పేరుతో ఓ రిపోర్ట్‌ను విడుదల చేశారు. తలనొప్పి స్త్రీ, పురుషుల్లో వేర్వరుగా ఉంటుందని అందులో పేర్కొన్నారు. పురుషులకన్నా కూడా మహిళలకు తలనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, ముఖ్యంగా 50 సంవత్సరాలు లోపు మహిళలు తలనొప్పి కారణంగా తీవ్రమైన అనారోగ్యం ఎదుర్కొంటున్నారని వివరించారు. ఇందుకు కొన్ని కారణాలను కూడా వెల్లడించారు.
హార్మోనల్ సమస్యల వల్ల తలనొప్పి:
సాధారణంగా మహిళల్లో రుతుక్రమం కారణంగా శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు ద్వారా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు, మెనోపాస్ దశలోనూ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని, ఈ కారణంగానే తలనొప్పి వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో తగ్గినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.
చిన్నతనంలో తలనొప్పి బారిన పడే వారిలో పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఈ స్టడీలో పేర్కొన్నారు. అయితే వయసు పెరిగే కొద్దీ పురుషుల్లో మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుందని తెలిపారు. ఎందుకంటే పురుషుల శరీరంలో హార్మోన్లు యుక్త వయసుకు వచ్చిన అనంతరం స్థిరంగా ఉంటాయి. పెద్దగా హెచ్చుతగ్గులు ఉండవు. ఈ కారణంగానే వారిలో తలనొప్పి వచ్చే అవకాశం తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరో అధ్యయనంలో మహిళల్లో రుతుక్రమం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పటినుంచి ఈ మైగ్రేన్ తలనొప్పి ప్రారంభమవుతుంది. మెనోపాజ్ వరకు ఈ పాట్లు తప్పవని ఈ అధ్యయనంలో తేలింది. దీనికి ప్రధాన కారణం ఈస్ట్రోజన్ లెవెల్స్ శరీరంలో తగ్గడమే.
ఒత్తిడి కూడా తలనొప్పికి కారణం:
మహిళలు, పురుషులు అన్న తేడా లేకుండా పని ఒత్తిడి కారణంగా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధ్యయనంలో భాగంగా ఒక లక్ష మంది ఉద్యోగులను అధ్యయనం చేస్తే వారిలో కనీసం 600 వరకు కేసులు తీవ్రమైన తలనొప్పి కారణంగా అనారోగ్యం పాలైనట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. దీనికి ప్రధాన కారణం.. పనిలో ఒత్తిడి అని తేలింది. ఒత్తిడితో పాటు ఆందోళన చెందడం ద్వారా కూడా తలనొప్పి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర విషయంలో కూడా, పొరపాట్లు చేసినట్లయితే తలనొప్పి తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పరిష్కారం ఇదే:
తలనొప్పి నుంచి బయటపడేందుకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయి. తరచూ వ్యాయామం చేయడం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు యోగా వంటి మానసిక ప్రశాంతత కలిగించే అభ్యాసాలు చేయడం, సరైన పోషకాహారం తీసుకోవడం, ప్రశాంతంగా ఉండటం, నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండటం వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : కొవిడ్ జెఎన్ 1 లక్షణాలు ఇవే.. దీనితో ప్రాణహాని తప్పదా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.