తలనొప్పి అత్యంత సాధారణమైన సమస్య. లోకంలో చాలా మంది మైగ్రేన్ లేదంటే టెన్షన్ వల్ల కలిగే తలనొప్పితో బాధ పడుతున్నారని నార్వేజియన్ నిపుణులు ఒక అధ్యయనం ద్వారా కనుగొన్నారు. పారాసిటమాల్, ఐబుప్రొఫిన్ లేదా ఆస్పిరిన్ వంటి సాధారణ పెయిన్ కిల్లర్స్ తలనొప్పి తగ్గించేందుకు విరివిగా వాడుతున్నారని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైద్య నిపుణులు పెయిన్ కిల్లర్ వాడకుండా తలనొప్పి తగ్గించుకునే మార్గాలను వివరించారు.


మెడకు మసాజ్


మెడ కండరాలు బిగుసుకు పోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఇలాంటి తలనొప్పి తగ్గించుకోవడానికి మెడ కండరాలకు మంచి మసాజ్ ఇస్తే సరిపోతుందట. చాలా సార్లు ఈ చిన్న చిట్కాతో తలనొప్పి తగ్గిపోతుందట. కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు మెడ కండరాలు బలోపేతం అవుతాయి. మెడ కండరాలు బలంగా ఉంటే తలనొప్పి రాకుండా నివారించవచ్చు. తల మీద చేతిని ఉంచి తలను పక్కకి పది సెకండ్ల పాటు నొక్కి ఉంచడం వల్ల మెడ కండరాలు బలం సంతరించుకుంటాయి.


నీళ్లు ఎక్కువ తాగాలి


డీహైడ్రేషన్ కూడా తలనొప్పికి కారణం అవుతుందని గుర్తుంచుకోవాలి. రోజులో తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. కనీసం రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం మాత్రమే కాదు, మెదడు కణజాలాలు కూడా ఆరోగ్యంగా, కుంచించుకు పోకుండా ఉంటాయి. మెదడు కణజాలం కుంచించుకు పోతే పుర్రెనుంచి దూరంగా జరగడం వల్ల నాడులు లాగినట్టయి తలనొప్పి వస్తుంది. అలా జరగకూడదంటే తప్పనిసరిగా తగినన్ని నీళ్లు తాగాలి.


సరిపడా నిద్ర తప్పనిసరి


తిండి, నిద్ర, శ్రమ, జీవిత నాణ్యతను నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఏది తగ్గినా ఆరోగ్యానికి మంచిది కాదు. నిద్ర సరిపడినంత లేకపోతే మొదట కనిపించే లక్షణం తలనొప్పే. 18 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న అందరూ 6 నుంచి 11 గంటల పాటు నిద్ర పోవాల్సిందేనని నిపుణులు సలహా ఇస్తున్నారు. కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాల్సి ఉంటుందట. నిద్ర శరీరానికి విశ్రాంతిని ఇచ్చి మెదడు తిరిగి రెజువనేట్ కావడానికి దోహదం చేస్తుంది. అందువల్ల తలనొప్పి రాకుండా చేస్తుంది.


తగినంత విశ్రాంతి తీసుకున్నపుడు శరీరం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఫలితంగా ఏ అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికైనా ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది. అలసట కూడా కొన్ని సార్లు తలనొప్పికి కారణం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి దానంతట అదే తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.


దంతాలు ఒకసారి పరీక్షించి చూసుకోవాలి


తరచుగా పొద్దున్న నిద్ర లేచేసరికి తలనొప్పిగా ఉంటే మాత్రం నిద్రలో దవడ, నోరు బిగించి పెట్టుకోవడం వల్లే నని గుర్తించాలి. దంతాల వరుస సరిగ్గా లేకపోవడం వల్ల దవడ కండరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది తలనొప్పికి కారణం కావచ్చు. దవడ అమరికలో తేడా వల్ల కలిగే ఈ నొప్పిని నిర్ధారించుకోవడానికి ఒకసారి డెంటిస్ట్ ను కలిస్తే మంచిది. ఈ కారణంతో తలనొప్పి వస్తుంటే మాత్రం తప్పనిసరిగా మౌత్ గార్డ్ ను ఉపయోగించాల్సి రావచ్చని అనీషా జోషి చెబుతున్నారు.


Also read: పిసిఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాల జాబితా ఇదిగో