జుట్టుకు, చర్మానికి సంబంధించిన ఎన్నో కాస్మెటిక్స్‌లో అలోవెరా జెల్ వినియోగిస్తారు. అలోవెరాను ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఈ కాస్మెటిక్స్‌ను తయారు చేస్తారు. అలా కాకుండా నేరుగా ఇంట్లో మొక్కను పెంచి, ఆ ఆకుల్లోంచి అలోవెరా జెల్‌ను ముఖానికి రాసుకున్నా కూడా ఎంతో మంచిది. అలాగే జుట్టుకు కూడా ఈ అలోవెరా జెల్ ఎంతో మేలు చేస్తుంది. వానాకాలం వచ్చిందంటే జుట్టు మెరుపుదనం తగ్గిపోతుంది. అలాగే వర్షంలో తడవడం వల్ల చుండ్రు వాసన రావడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వీటన్నిటి నుంచి మీ వెంట్రుకలను కాపాడుకోవాలని అనుకుంటే అలోవెరా జెల్‌తో ఇలా చేయండి. 


తల స్నానం చేయడానికి రెండు గంటల ముందే గోరువచ్చని నూనెను మీ కుదుళ్లకు పట్టించండి. మృదువుగా మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల కురులు మృదువుగా మారతాయి. తలస్నానం చేసిన తర్వాత కలబంద మొక్క ఆకులోని జెల్‌ను సేకరించి దాన్ని మాడుకు, వెంట్రుకలకు పట్టించండి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. చుండ్రును తగ్గిస్తాయి. వెంట్రుకలు బలంగా ఎదిగేలా చేస్తాయి. మాడుపై ఉన్న బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. దురద వంటి సమస్యలకు చెప్పి పెడతాయి. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతాయి.


అలోవెరా జెల్ జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ చేస్తుంది. దీన్ని వాడడం వల్ల జుట్టు నలుపుగా, మెరుపుతో ఎదుగుతుంది. కలబంద గుజ్జులో ప్రోటీలిటిక్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి మాడుపై దెబ్బతిన్న కణాలను నయం చేస్తాయి. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల జుట్టు వేగంగా ఎదుగుతుంది. వెంట్రుకలు రాలిపోవడానికి ఇది తగ్గిస్తుంది. అలాగే జుట్టు చివరి భాగంలో వెంట్రుకలు చిట్లకుండా, ఒత్తుగా ఉండేలా చేస్తుంది. కొందరికి మాడుపై దురదలు వస్తూ ఉంటాయి. తలపై తెగ గోక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అలోవెరా జెల్ మాడుకు పట్టించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ కలబంద గుజ్జులో ప్రోటీన్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఖనిజాలు కూడా ఎక్కువే. మీ జుట్టు ఫోలికల్స్ సమర్ధంగా పోషించడానికి ఇవి సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే తేమ ఉండాల్సిందే. జుట్టుకు కావాల్సిన తేమను అందించడంలో కలబంద జెల్ ముందుంటుంది. 


జుట్టు పొడవుగా పెరగడం కోసం ఇలా చేయండి. ఒక గిన్నెలో కలబంద గుజ్జు, ఆముదం, మెంతుల పొడి వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. ఐదారు గంటలు అలానే ఉంచండి. ఆ తర్వాత సాధారణ గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. షాంపూ రాసుకున్న ఫర్వాలేదు. ఇలా వారానికి ఒకటి నుంచి రెండుసార్లు చేస్తే జుట్టు పెరుగుదల బాగుంటుంది.


Also read: మిమ్మల్ని, మీ నిర్ణయాలను తిరస్కరిస్తే తట్టుకోలేకపోతున్నారా? మీకు ఈ రిజెక్షన్ ట్రామా ఉందేమో?






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.