చాలా మంది రాత్రి వేళ కొబ్బరి నూనె రాసుకుని పొద్దున్నే తలస్నానం చేస్తారు. జుట్టు శుభ్రంగా ఉంచుకుంటేనే వెంట్రుకలు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటాయి. అయితే తరచూ జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టు రాలడం, చిట్లిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకు కారణం తలస్నానం చేసేటప్పుడు మనం చేసే కొన్ని తప్పులు. హెయిర్ వాష్ చేసుకోవడం చాలా సులభం అనుకుంటారు కానీ అది అంత సులభం కాదు. మనం చేసే కొన్ని తప్పుల వల్ల జుట్టు ఆరోగ్యం నాశనం అవుతుంది. తలస్నానం చేసేప్పుడు ఈ తప్పులు అసలు చేయొద్దు.


పొడి జుట్టు మీద షాంపూ చేయొద్దు


ఎక్కువ మంది చేసే తప్పు ఇది. పొడి జుట్టుమీద షాంపూ అప్లై చేయడం కరెక్ట్ కాదు. షాంపూ అప్లై చేసే ముందు జుట్టుని పూయార్థిగా నీటిలో నానబెట్టాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు షాంపూ బాగా పట్టి జుట్టు శుభ్రపడుతుంది. పొడి జుట్టు మీద షాంపూ పెట్టడం వల్ల తలపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. షాంపూ అవశేషాలు వదిలించుకోవడం కష్టం అవుతుంది. అందుకే తలస్నానం చేసేటప్పుడు జుట్టుని 1-2 నిమిషాల పాటు నీటితో నానబెట్టాలి.


ఎక్కువ షాంపూ, కండిషనర్ వద్దు


తలస్నానం చేసేప్పుడు సరైన మొత్తంలో షాంపూ, కండిషనర్ చాలా ముఖ్యం. అధికంగా షాంపూని ఉపయోగించడం వల్ల జుట్టు మరింత శుభ్రంగా ఉంటుందని అనుకుంటారు. కండిషనర్ ఎక్కువగా పెడితే జుట్టు మరింత మృదువుగా మారుతుందని అపోహ పడతారు. కానీ అధిక షాంపు జుట్టు సహజ తేమని దెబ్బతీస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది. జుట్టు చివర్ల  కూడా దెబ్బతింటుంది. కండిషనర్ ఎక్కువగా పెట్టడం వల్ల జుట్టు జిడ్డుగా తయారవుతుంది.


చిక్కు జుట్టు మీద షాంపూ పెట్టకూడదు


జుట్టు రాలడాన్ని నివారించాలనుకుంటే తలస్నానం చేసే ముందు జుట్టు చిక్కు తీసుకోవడం తప్పనిసరి. చిక్కులేని జుట్టుని బలవంతంగా కడగటానికి ట్రై చేస్తే జుట్టు విరిగిపోతుంది. అందుకే షాంపూ జుట్టుకి పట్టాలంటే జుట్టు విడివిడిగా ఉండాలి. వాషింగ్ కూడా సున్నితంగా చేసుకోవాలి.


ప్రతిరోజు తలస్నానం చేస్తున్నారా?


ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యకరమైన జుట్టు ఉండదు. ఇది జుట్టు సహజ నూనెని తొలగిస్తుంది. దాని వల్ల జుట్టు పొడిగా, నిస్తేజంగా మారిపోతుంది. జుట్టు సహజమైన మెరుపుని కాపాడుకోవాలంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు తేలికపాటి షాంపూని ఉపయోగించి తలస్నానం చేయాలి.


స్కాల్ఫ్ మీద ఒత్తిడి తీసుకురావద్దు


స్కాల్ఫ్ శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మాడు గట్టిగా రుద్దుతారు. అలా గట్టిగా రుద్దటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారిపోతాయి. జుట్టు రాలడానికి కారణమవుతుంది. అందుకే స్కాల్ఫ్ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురాకుండా సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. షాంపూని ఉపయోగిస్తున్నప్పుడు చేతివేళ్ళతో తలపై తేలికగా మసాజ్ చేసుకోవాలి.


సరైన నీరు ఉపయోగించడం లేదా?


మితిమీరిన వేడి నీటితో జుట్టు శుభ్రం చేసుకోవడం అసలు మంచిది కాదు. ఇది జుట్టు చిట్లడం, రాలడానికి దారితీస్తుంది. జుట్టు మీద ఎక్కువ వేడి నీటిని వాడటం వల్ల జుట్టు పొడిగా మారిపోతుంది. అలాగే అంత వేడి తలకి మంచిది కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఎప్పుడు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?