Hair Washing at Beauty Parlors : సెలూన్‌ లేదా బ్యూటీ పార్లర్​కి చాలామంది వెళ్తూ ఉంటారు. స్కిన్, హెయిర్​కి సంబంధించిన ట్రీట్​మెంట్స్​ చేయించుకుంటారు. అలా వెళ్లినప్పుడు ఎక్కువమంది రెగ్యులర్​గా చేయించుకునేది హెయిర్ వాష్. సెలూన్​ లేదా బ్యూటీ పార్లర్​లో హెయిర్ వాష్ చేయించుకోవడాన్ని చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే వాష్​కి ముందు వాళ్లు చేసే మసాజ్​ వల్ల రిలాక్స్ అనిపిస్తుంది. అలాగే వారు ఉపయోగించే ప్రొడెక్ట్స్ హెయిర్​ని మంచిగా చేస్తాయి. అయితే మీకు తెలుసా? మిమ్మల్ని రిలాక్స్ చేసే ఈ ప్రక్రియ మీ ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

బ్యూటీ పార్లర్ స్ట్రోక్

హెయిర్ వాష్ చేయించుకునేప్పుడు వచ్చే స్ట్రోక్​ను బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ అంటారు. అందుకే హెయిర్ వాష్ చేయించుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఇది అరుదైన సమస్యే అయినా జాగ్రత్తగా లేకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే అంశంపై ఢిల్లీలోని సుఖ్‌దేవ్ విహార్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న డాక్టర్ ప్రమోద్ కుమార్ దీని గురించిన ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 

స్ట్రోక్​కి కారణాలు ఇవే.. 

హెయిర్ వాష్​లో భాగంగా కుర్చీలో ఉన్న వ్యక్తి చాలాసేపు వాష్​బేషన్​లో తలను ఉంచడం కోసం.. తలను వెనక్కి వంచాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు ధమనులపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఆ సమయంలో ఈ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. 2016లో నిర్వహించిన ఒక వైద్య అధ్యయనం Beauty Parlor Stroke Revisited (PubMed)లో.. 11 సంవత్సరాలలో హెయిర్ వాష్‌తో సంబంధం ఉన్న స్ట్రోక్ లక్షణాలు కలిగిన 10 కేసులు నమోదైనట్లు గుర్తించింది. అంటే ఇలాంటి కేసులు అరుదుగా కనిపిస్తాయి కానీ జరుగుతాయి.

Continues below advertisement

"ఎవరి ధమనులు బలహీనంగా ఉన్నాయో లేదా రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ లేదా ఇతర గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి మెడపై కొద్దిగా ఒత్తిడి పడినా.. ఈ తరహా సమస్యలు వస్తాయి." అని ప్రమోద్ తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

బ్యూటీ పార్లర్ స్ట్రోక్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే.. హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు కుర్చీలో ఎక్కువసేపు తల వెనుకకు వంచకూడదు. అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే హెయిర్ డ్రెస్సర్‌కు చెప్పండి. ఇప్పటికే మీరు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

సెలూన్‌లో హెయిర్ వాష్ మంచిదే. ఎన్నో లక్షలమంది ఎటువంటి సమస్యలు లేకుండా దీన్ని చేయించుకుంటారు. ఈ రకమైన సమస్య చాలా అరుదు. కానీ ఆ సమయంలో పరిస్థితి చేజారకుండా ఉండేందుకు అందరికీ దీనిపై అవగాహన ఉండాలి. అలాగే మెడ నొప్పి, మైకం వంటి ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే మీరు అబ్జెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల సమస్య పెద్దది కాకుండా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.