HeatWaves: భూమిపై వాతావరణం మారుతోంది. వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. దీనివల్ల హీట్ వేవ్స్ అంటే వడగాలులు వీచే అవకాశం ఎక్కువ. వీటి తీవ్రత అధికంగా ఉంటే అవి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఐదు రోజులు ఉష్ణోగ్రతల అధికంగా ఉంటే వడగాలులు వీస్తున్నట్టే లెక్క. ఆ వడగాలులు మన శారీరక, మానసిక శ్రేయస్సుకు విఘాతం కలిగిస్తాయి. వాతావరణంలో ఈ మార్పుల వల్ల పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. వారి అధ్యయనంలో హ హీట్ వేవ్ కారణంగా కీటకాలలో స్పెర్మ్  దెబ్బతిన్నట్టు గుర్తించారు. దీనివల్ల భవిష్యత్ తరాలపై ప్రభావం పడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. 


మగ వారిలో...
మనుషుల్లో కూడా హీట్ వేవ్ అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. మగవారిలో స్పెర్మ్ ఉత్పత్తి వృషణాలలో జరుగుతుంది. వాటి లోపల చల్లగా ఉండాలి. ఎప్పుడైతే హీట్ వేవ్ కారణంగా వాటి ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుందో వీర్యకణాల ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. ఇది పురుషుల సంతాన ఉత్పత్తి సామర్థ్యం పై అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. కేవలం మనుషుల్లోనే కాదు క్షీరద జాతుల్లోని పునరుత్పత్తి విధులపై వడగాలులు ప్రతికూల ప్రభావాలను చూపుతాయి.


ఆడవారిలో...
ఆడవారి సంతాన ఉత్పత్తి సామర్ధ్యం పై కూడా వడగాలులు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఆడవారిలో ఓజేనీసిస్ (ఇది అండంలోని ఒక భాగం), ఓసైట్ పరిపక్వత, ఫలదీకరణ అభివృద్ధి వంటి వాటిపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల అండం ఫలదీకరణం జరగడం ఆలస్యం అవుతుంది. విపరీతమైన వేడి మహిళల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అధ్యయనం కూడా చెబుతోంది. గర్భవతులుగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరి అంతర్లీన ఆరోగ్య పరిస్థితులపై బయట పెరుగుతున్న వేడి హానికరమైన మార్పులకు కారణం కావచ్చు.


వేడి వల్ల కలిగే ఒత్తిడి శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. అలాగే మహిళల్లో క్రమ రహిత పీరియడ్స్, అధిక రక్తస్రావం కావడం, పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం వంటి వాటికీ కారణం అవుతుంది. ఒత్తిడి మరీ ఎక్కువైతే అమెనోరియాకు దారి తీస్తుంది. అంటే రుతుస్రావం పూర్తిగా ఆగిపోతుంది. గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన శిశువులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వడగాలుల బారిన పడకూడదు. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 


జాగ్రత్తలు తీసుకోండి
పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్న వారు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. చల్లగా ఉండే గదుల్లోనే నివసించాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. వీలైనంతవరకు ఇంటిపట్టునే ఉండాలి. అధిక వేడి సమయంలో వ్యాయామాలు చేయడం, వాకింగ్‌కు వెళ్లడం చేయకూడదు. జ్వరం వస్తున్నట్టు అనిపిస్తే అది హీట్ స్ట్రోక్ వల్ల ఏమో అని అనుమానించాలి. వెంటనే వైద్యులను కలిసి తగిన సహాయం తీసుకోవాలి. 



Also read: ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తాడు, వచ్చిన వెంటనే ఆ పనిలో పడతాడు, అతడిని మార్చడం ఎలా?





















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.